సైబర్‌ నేరం జరిగితే వెల్లడించాల్సిందే

IBM sets up APAC cybersecurity hub in Bengaluru - Sakshi

దాచడం కుదరదు

ఇందుకు కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నాం

కేంద్ర ఐటీ సహాయ మంత్రి చంద్రశేఖర్‌ ప్రకటన

న్యూఢిల్లీ: కంపెనీలు ఏదైనా సైబర్‌ దాడికి గురైతే దాన్ని ప్రభుత్వానికి వెల్లడించాలన్న చట్టాన్ని తీసుకొస్తున్నట్టు కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. బెంగళూరులో ఐబీఎం ఏర్పాటు చేసిన సైబర్‌ సెక్యూరిటీ కమాండ్‌ సెంటర్‌ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 10 కోట్ల సైబర్‌ దాడుల ఘటనలను కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (ఇండియా సీఈఆర్‌టీ) గుర్తించినట్టు చెప్పారు. సైబర్‌ దాడుల పరంగా భారత్‌ ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశమని పేర్కొన్నారు. ‘‘ఇలాంటి సైబర్‌ దాడులు జరిగితే బయటకు వెల్లడించకుండా దాచడం కుదరదు.

వీటిని వెల్లడించాల్సిన బాధ్యతను సంస్థలపై పెట్టనున్నాం. ఇందుకు సంబంధించి కొన్ని రోజుల్లో నూతన చట్టం గురించి ప్రకటన వింటారు’’అని మంత్రి ప్రకటించారు. ముప్పు విషయంలో ప్రభుత్వం, ప్రభుత్వ ఏజెన్సీలకు పూర్తి స్పష్టత ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. సైబర్‌ విభాగం సురక్షితంగా, విశ్వసనీయంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని గుర్తు చేశారు. ‘‘మనం పెద్ద ఎత్తున సామర్థ్యాల విస్తరణపై పెట్టుబడులు పెడుతున్నాం. ఇంటర్నెట్‌ అన్నది సురక్షితంగా ఉండాలి. స్వేచ్ఛాయుతంగా, విశ్వసనీయమైనదిగా ఉండాలి. ఇంటర్నెట్‌కు సంబంధించిన మధ్యవర్తులు వినియోగదారులకు జవాబుదారీగా వ్యవహరించాలి’’ అని మంత్రి చెప్పారు.

ఆసియా పసిఫిక్‌లో మొదటిది
బెంగళూరులో ఏర్పాటు చేసిన కేంద్రం ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోనే మొదటిదిగా ఐబీఎం ఇండియా ఎండీ సందీప్‌ పటేల్‌ తెలిపారు. సైబర్‌ భద్రత విషయంలో టెక్నిక్‌లపై శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఈ కేంద్రంలోనే కొత్త సెక్యూరిటీ ఆపరేషన్‌ సెంటర్‌ ద్వారా ప్రపంచవ్యాప్త క్లయింట్లకు సెక్యూరిటీ రెస్పాన్స్‌ సేవలను అందించనున్నట్టు తెలిపారు.     

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top