Hyderabad Real Estate: రియల్టీ పెట్టుబడుల్లో హైదరాబాద్‌ టాప్‌!

Hyderabad Tops In Realty Investments - Sakshi

ఈ ఏడాది క్యూ1లో 384 మిలియన్‌ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌ 

ఆ తర్వాత ముంబై, ఢిల్లీ, పుణే వంటి నగరాలు.. 

దేశవ్యాప్తంగా 922 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు 

జేఎల్‌ఎల్‌ నివేదిక వెల్లడి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో నిధుల ప్రవాహం కొనసాగింది. ఈ ఏడాది జనవరి–మార్చి (క్యూ1) మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 922 మిలియన్‌ డాలర్ల సంస్థాగత పెట్టుబడులు రాగా.. ఇందులో 41 శాతం అంటే 384 మిలియన్‌ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌ హైదరాబాద్‌ రియల్టీ రంగంలోకి వచ్చాయని జేఎల్‌ఎల్‌ నివేదిక వెల్లడించింది. ఫీనిక్స్‌ వంటి పలు నిర్మాణ సంస్థలు నగరంలో కొత్త అభివృద్ధి ప్రాజెక్ట్‌లు ప్రారంభించడమే ఈ వృద్ధికి కారణమని తెలిపింది. గతేడాది క్యూ1లో హైదరాబాద్‌లోకి 100 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.

గతేడాది క్యూ1తో పోలిస్తే ఈ ఏడాది క్యూ1లో ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 21 శాతం వృద్ధి నమోదయింది. గతేడాది క్యూ1లో 763 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. 2021 క్యూ1లోని మొత్తం సంస్థాగత పెట్టుబడుల్లో 94 శాతం కమర్షియల్‌ ఆఫీస్‌ స్పేస్‌ విభాగమే ఆకర్షించింది. ఇందులోకి 864 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఆఫీస్‌ స్పేస్‌ డెవలపర్లు తమ పోర్ట్‌ఫోలియోలను తదుపరి దశ విస్తరణ కోసం వృద్ధి మూలధనాన్ని పెంచడం లేదా తగ్గించడం కోసం లిక్విడేట్‌ చేశారని జేఎల్‌ఎల్‌ చీఫ్‌ ఎకనామిస్ట్, హెడ్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ డాక్టర్‌ సమంతక్‌దాస్‌ తెలిపారు. ప్రధాన, అభివృద్ధి చెందే ప్రాంతాల్లోని కార్యాలయాల మార్కెట్‌ స్థితిస్థాపకత, దీర్ఘకాలిక వృద్ధి, నాణ్యమైన ఆస్తులపై పెట్టుబడిదారులు ఆసక్తి కనబరిచారు. మరోవైపు రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (రీట్స్‌) ప్రత్యామ్నాయ పెట్టుబడులతో ఆదాయ స్థిరత్వాన్ని అందుకోవచ్చు. 

వచ్చే క్వాటర్‌లో గిడ్డంగులదే హవా.. 
కుటుంబ కార్యాలయాలు, విదేశీ కార్పొరేట్‌ గ్రూప్‌లు, విదేశీ బ్యాంక్‌లు, ప్రొపైటరీ బుక్స్, పెన్షన్‌ ఫండ్స్, ప్రైవేట్‌ ఈక్విటీలు, రియల్‌ ఎస్టేట్‌ ఫండ్స్‌–కం–డెవలపర్స్, పెన్షన్‌ ఫండ్స్, ఎన్‌బీఎఫ్‌సీ మరియు సావరిన్‌ వెల్త్‌ ఫండ్లు, రిట్స్‌ ఇవన్నీ కూడా సంస్థాగత పెట్టుబడులలో కలిసి ఉంటాయి. అలాగే ఈ త్రైమాసికంలో ఇన్వెస్టర్లు గిడ్డంగుల విభాగంలో పెట్టుబడులను అన్వేషించారు. వచ్చే క్వాటర్‌ నాటికి ఆయా ఒప్పందాలు ముగిసే అవకాశాలున్నాయని తెలిపారు. నివాస విభాగం మాత్రం మూలిగే దశలోనే కొట్టుమిట్టాడుతోంది. ప్రాజెక్ట్‌ నిర్మాణాలను పూర్తి చేసేందుకు నిధుల సమస్యలను ఎదుర్కొంటుంది. 

నగరాల వారీగా ఇన్వెస్ట్‌మెంట్స్‌.. 
ఈ ఏడాది క్యూ1 ముంబైలోకి 193 మిలియన్‌ డాలర్ల ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ రాగా.. ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో 107 మిలియన్‌ డాలర్లు, పుణేలోకి 7 మిలియన్‌ డాలర్లు, ఇతర నగరాలన్నీ కలిపి 231 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top