
హైదరాబాద్‌లో 6 శాతం డౌన్
టాప్–8 నగరాల్లో 14 శాతం తగ్గిన విక్రయాలు
ప్రాప్ టైగర్ నివేదిక విడుదల
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు జూన్ త్రైమాసికంలో పడిపోయాయి. ధరల పెరగుదల ప్రభావం విక్రయాలపై చూపించింది. 11,513 యూనిట్ల అమ్మకాలు హైదరాబాద్‌లో నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే మూడు నెలల్లో అమ్మకాలు 11,065 యూనిట్లుగా ఉండడం గమనార్హం. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా టాప్–8 నగరాల్లోనూ ఇళ్ల అమ్మకాలు జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 14 శాతం తగ్గి 97,674 యూనిట్లకు పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ నగరాల్లో అమ్మకాలు 1,13,768 యూనిట్లుగా ఉన్నాయి. ప్రాప్ టైగర్ సంస్థ ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. అత్యధికంగా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), పుణెలో కలిపి అమ్మకాలు 30 శాతం పడిపోయాయి.
→ ఏప్రిల్–జూన్ కాలంలో ఎంఎంఆర్‌లో ఇళ్ల అమ్మకాలు 25,939 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 38,266 యూనిట్లతో పోల్చితే 32 శాతం తగ్గాయి.
→ పుణెలో ఇళ్ల అమ్మకాలు 27 శాతం తగ్గి 15,962 యూనిట్లకు పరిమితమయ్యాయి.
→ అహ్మదాబాద్‌లో కేవల ఒక శాతమే తగ్గాయి. 9,451 యూనిట్ల విక్రయాలు జరిగాయి.
→ ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 9 శాతం తగ్గి 10,051 యూనిట్లుగా ఉన్నాయి.
→ బెంగళూరులో మాత్రం ఇళ్ల అమ్మకాలు 16 శాతం పెరిగి 15,628 యూనిట్లకు చేరాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 13,495 యూనిట్లుగా ఉన్నాయి.
→ చెన్నై మార్కెట్లోనూ 33 శాతం పెరిగి 5,283 యూనిట్లు అమ్ముడయ్యాయి.
→ కోల్‌కతా మార్కెట్లో 19 శాతం అధికంగా 3,847 యూనిట్ల విక్రయాలు జరిగాయి.
→ ఎంఎంఆర్ పరిధిలో ముంబై, నవీ ముంబై, థానే మార్కెట్ల గణాంకాలు కలసి ఉన్నాయి. ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో గురుగ్రామ్, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్ అమ్మకాలు కలసి ఉన్నాయి.
ధరల ఒత్తిళ్లు..
‘‘ఇళ్ల విక్రయాలు తగ్గుముఖం పట్టడానికి డిమాండ్ బలహీనత కంటే మార్కెట్లో వచి్చన మార్పుల ఫలితం వల్లేనని తెలుస్తోంది. ముఖ్యంగా ధరల పరమైన ఒత్తిళ్లు నెలకొనడంతో బడ్జెట్, మధ్యాదాయ ఇళ్ల విభాగాల్లో కొనుగోళ్ల పరంగా అప్రమత్తత నెలకొంది’’అని ప్రాప్ టైగర్ సేల్స్ హెడ్ శ్రీధర్ శ్రీనివాసన్ తెలిపారు.