
శైలేష్ జేజురికర్.. హెచ్‌పీఎస్ పూర్వ విద్యార్థి
సనత్‌నగర్: బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో విద్యనభ్యసించిన శైలేష్ జేజురికర్ ప్రముఖ వినియోగ వస్తువుల దిగ్గజ కంపెనీ ప్రొక్టర్ అండ్ గాంబుల్ (పీ అండ్ జీ) గ్లోబల్ సీఈఓగా నియమితులయ్యారు. పీ అండ్ జీ కంపెనీ అమెరికన్ మల్టినేషనల్ కన్జ్యూమర్ గూడ్స్ కార్పొరేషన్. అమెరికాలోని సిన్సినాటి ప్రధాన కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 58 ఏళ్ల శైలేష్ జేజురికర్ ప్రస్తుతం పీ అండ్ జీకి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. 2026, జనవరి 1 నుంచి ఆ సంస్థ సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఆయన పాఠశాల విద్యాభ్యాసం హెచ్‌పీఎస్‌లో సాగగా.. 1987లో ముంబై విశ్వవిద్యాలయం నుంచి బీఏ ఎకనామిక్స్‌లో పట్టా పొందారు. 1989లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్–లక్నోలో ఎంబీఏ పూర్తి చేసి, అదే సంవత్సరం పీ అండ్ జీలో చేరారు. తాజాగా భారతీయ గ్లోబల్ సీఈఓల జాబితాలో శైలేష్ జేజురికర్ (Shailesh Jejurikar) కూడా చేరారు.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివి మైక్రోసాఫ్ట్ సీఈఓగా పనిచేస్తున్న సత్య నాదెళ్ల, డెలాయిట్ కన్సల్టింగ్‌కు చెందిన సౌమ్య చక్రవర్తి, టెస్లాకు చెందిన నాగేందర్ వంటి వారు శేలేష్ క్లాస్‌మేట్స్. హెచ్‌పీఎస్ 1984 బ్యాచ్‌లో శైలేష్ పాఠశాల హెడ్‌బాయ్‌గా నియమితులయ్యారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella), శైలేష్ జేజురికర్‌లు మంచి స్నేహితులు. గ్లోబల్ సీఈఓల ఫ్యాక్టరీగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నిలవడం గర్వకారణమని ఈ సందర్భంగా పాఠశాల మేనేజ్‌మెంట్ కమిటీ, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు.
చదవండి: సుందర్ పిచాయ్, ఎలాన్ మస్క్.. ఎడ్యుకేషన్ ఏంటి?