జూనియర్లకు పెద్ద జీతాలు .. ముందు వరుసలో హైదరాబాద్‌

Hyderabad Gives Strong Competition To Bengaluru In Salaries of IT Sector - Sakshi

చారిత్రాత్మక కాస్మోపాలిటన్‌ నగరం హైదరాబాద్‌ వేలాది మంది నిరుద్యోగుల కలల స్వప్నం. దేశం నలుమూలల నుంచి ఉపాధి కోసం హైదరాబాద్‌ నగరానికి చాలా మంది వస్తుంటారు. ఇందులో చాలా మంది లక్ష్యం ఐటీ సెక్టార్‌లో కొలువు సంపాదించడమే. ఇలా ఉద్యోగన్వేషలో వచ్చే వారికి పెద్ద మొత్తంలో జీతాలు ఆఫర్‌ చేస్తున్నాయి నగరంలో కోలువైన కంపెనీలు. 

జీతాలు ఎలా ఉన్నాయి
ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్‌ సెక్టార్‌లలో సీనియర్‌, మిడ్‌ లెవల్‌, జూనియర్‌ కేటగిరీల్లో జీతాలు ఎలా ఉన్నాయమనే అంశంపై రాండ్‌స్టాండ్‌ సంస్థ ఇటీవల సర్వే చేపట్టింది. రాండ్‌స్టాండ్‌ నివేదికను పరిశీలిస్తే.. ఐటీ సెక్టార్‌లో హైదరాబాద్‌ నగరం నంబర్‌ వన్‌ స్థానం కోసం పోటీ పడుతోందని తెలుస్తోంది. దేశంలో ముంబై, ఢిల్లీ ఎన్‌సీఆర్‌, చెన్నై, కోలక్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌, పూనే నగరాల్లో ఐటీ పరిశ్రమ ఎక్కువగా నిలదొక్కుకుంది. ఈ నగరాల డేటాను పరిశీలిస్తే ఐటీ ఎంప్లాయిస్‌కి ఎక్కువ జీతాలు ఇవ​‍్వడంలో బెంగళూరు ప్రథమ స్థానంలో ఉండగా హైదరాబాద్‌ సెకండ్‌ పొజిషన్‌లో ఉంది. 

జీతాల తీరు ఇలా
ఇక ఐటీ సెక్టార్‌లో సీనియర్‌, మిడ్‌ లెవల్‌, జూనియర్‌ కేటగిరీల్లో జీతాలను పరిశీలిస్తే.. ఇండియన్‌ సిలికాన్‌ వ్యాలీ బెంగళూరుకి హైదరాబాద్‌ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఐదేళ్ల అనుభవం ఉన్న జూనియర్‌ లెవల్‌కి సంబంధించిన ఉద్యోగులకు హైదరాబాద్‌లో వార్షిక వేతనం రూ.5.93 లక్షలుగా ఉండగా బెంగళూరులో ఇది రూ. 6.71 లక్షలుగా ఉంది. 6 నుంచి 14 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్‌ ఉన్న మిడ్‌ లెవల్‌ కేటగిరిలో హైదరాబాద్‌లో వార్షిక వేతనం 17.71 లక్షలు ఉండగా బెంగళూరులో రూ.18.06 లక్షలుగా ఉంది.  15 ఏళ్లకు పైగా ఎక్స్‌పీరియన్స్‌ ఉన్న సీనియర్‌ ప్రొఫెషనల్స్‌ కేటగిరిలో హైదారాబాద్‌లో యాన్యువల్‌ శాలరీ రూ. 29.78 లక్షలు ఉండగా బెంగళూరులో రూ. 34.47 శాతంగా ఉంది.

స్వల్ప తేడా
ఐటీ సెక్టార్‌లో మొదటి రెండు స్థానాల్లో ఉన్న బెంగళూరు, హైదరాబాద్‌లలో చెల్లిస్తున్న జీతాలను పరిశీలిస్తే.. జూనియర్‌ కేటగిరికి సంబంధించి బెంగళూరు, హైదరాబాద్‌ల మధ్య వ్యత్యాస​ం 11.6 శాతం ఉండగా మిడ్‌ లెవల్‌ కేటగిరిలో ఇది 2 శాతానికే పరిమితమైంది. సీనియర్‌ కేటగిరిలో మాత్రం హైదరాబాద్‌ కంటే బెంగళూరులో ఉన్న ఉద్యోగికి 16 శాతం అధికంగా వేతనం అందుతోంది.

నవంబర్‌ వన్‌ రేసులో
గడిచిన పదేళ్లుగా భారీ కంపెనీలను ఆకర్షించడంలో బెంగళూరుతో పోటీ పడుతోంది హైదరాబాద్‌. అమెజాన్‌, యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి సం‍స్థలకు గమ్యస్థానంగా హైదరాబాద్‌ మారింది. అంతేకాదు ఇటీవల కాలంలో స్టార్టప్‌ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌, స్పేస్‌ టెక్నాలజీకి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ విధానం ఖరారైంది. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే జూనియర్‌, మిడ్‌ కేటగిరిల్లో బెంగళూనును హైదరాబాద్‌ దాటవచ్చనే అంచనాలు ఉన్నాయి. 

చదవండి: క్సెల్‌లో కొత్త ఫీచర్లు.. చిరకాల డిమాండ్‌ నెరవేర్చిన మైక్రోసాఫ్ట్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top