హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు ఓకే! | Home sales in the Hyderabad market up 3 percent in the first six months | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు ఓకే!

Jul 4 2025 5:29 AM | Updated on Jul 4 2025 8:04 AM

Home sales in the Hyderabad market up 3 percent in the first six months

జనవరి–జూన్‌ కాలంలో 3% పెరుగుదల 

దేశవ్యాప్తంగా టాప్‌–8 నగరాల్లో పరిస్థితి భిన్నం 

బలంగా కార్యాలయ వసతుల లీజింగ్‌ 

నైట్‌ఫ్రాంక్‌ నివేదిక విడుదల

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 3 శాతం పెరిగాయి. 19,048 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ఇదే కాలంలో దేశవ్యాప్తంగా టాప్‌–8 నగరాల్లో చూస్తే భిన్నమైన పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 2 శాతం తగ్గినట్టు నైట్‌ఫ్రాంక్‌ నివేదిక వెల్లడించింది. ఆఫీస్‌ స్పేస్‌ (కార్యాలయ వసతులు) లీజింగ్‌ మార్కెట్‌ మాత్రం బలమైన పనితీరు చూపించింది.  

→ దేశవ్యాప్తంగా టాప్‌ 8 నగరాల్లో 2025 జనవరి–జూన్‌ కాలంలో ఇళ్ల అమ్మకాలు 1,70,201 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోని విక్రయాలతో పోల్చి చూస్తే 2 శాతం తక్కువ.  
→ ఎనిమిది నగరాల్లో ఇళ్ల ధరలు 2 శాతం నుంచి 14 శాతం మధ్య పెరిగాయి.  
→ ఇళ్ల అమ్మకాల్లో 49 శాతం రూ.కోటి అంతకుమించి ధరల శ్రేణిలోనే ఉన్నాయి. మిగిలిన 51 శాతం ఇళ్ల ధరలు రూ.కోటిలోపు ఉన్నాయి. 
→ ముంబై నగరంలో ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ఎలాంటి మార్పు లేకుండా 47,035 యూనిట్లుగా ఉన్నాయి. అహ్మదాబాద్‌ నగరంలో అమ్మకాలు కూడా పెద్ద మార్పు లేకుండా 9,370 యూనిట్లుగా ఉన్నాయి.  
→ చెన్నై నగరంలో క్రితం ఏడాది ఇదే కాలంలోని విక్రయాలతో పోల్చి చూస్తే 12 శాతం పెరిగి 26,795 యూనిట్లుగా నమోదయ్యాయి.  
→ బెంగళూరులో అమ్మకాలు 3 శాతం తగ్గి 26,599 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో 8 శాతం తగ్గి 26,795 యూనిట్లుగా ఉన్నాయి. 
→ పుణెలో ఒక శాతం తగ్గాయి. 24,329 యూనిట్ల విక్రయాలు జరిగాయి. కోల్‌కతాలో అమ్మకాలు 11 శాతం తగ్గి 8,090 యూనిట్లకు పరిమితమయ్యాయి.

జోరుమీదున్న ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ 
హైదరాబాద్‌ సహా టాప్‌–8 నగరాల్లో ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ ఈ ఏడాది జనవరి–జూన్‌ మధ్య క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 41 శాతం పెరిగి 48.9 మిలియన్‌ (489 లక్షలు) చదరపు అడుగులుగా (ఎస్‌ఎఫ్‌టీ) నమోదైంది. ఈ ప్రకారం చూస్తే ఈ ఏడాది మొత్తం మీద లీజింగ్‌ 80–90 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీకి చేరుకుంటుందని నైట్‌ఫ్రాంక్‌ అంచనా.   
→ చెన్నైలో ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ 68 శాతం వృద్దితో 5.1 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. 
→ ముంబైలో మాత్రం క్రితం ఏడాది మొదటి ఆరు నెలల కాలం గణాంకాలతో పోల్చి చూస్తే 5 శాతం క్షీణించి 5.5 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీకి పరిమితమైంది.  
→ బెంగళూరులో ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రెట్టింపై 18.2 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. 
→ ఢిల్లీ ఎన్‌సీఆర్‌ మార్కెట్లో బలమైన వృద్ధి నమోదైంది. 27 శాతానికి పైగా పెరిగి 7.2 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీకి చేరింది. 
→ పుణెలో లీజింగ్‌ 17% వృద్ధితో 5.1 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. 
→ కోల్‌కతాలో ఏకంగా 60 శాతం పెరిగి 1.1 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీకి చేరింది.  
→ అహ్మదాబాద్‌లో 51  శాతం తగ్గిపోయి 0.8 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీకి పరిమితమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement