
న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ కంపెనీ హెక్సావేర్ టెక్నాలజీస్ 120 మిలియన్ డాలర్లతో (రూ.1,029 కోట్లు) ఎస్‌ఎంసీ స్వేర్డ్‌ను కొనుగోలు చేసినట్టు ప్రకటించింది. గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల (జీసీసీలు) మార్కెట్లో విస్తరణకు ఈ డీల్ దోహదపడుతుందని పేర్కొంది. జీసీసీ కేంద్రాల నిర్మాణం, నిర్వహణ, బదిలీ సేవల్లో ఎస్‌ఎంసీ స్వేర్డ్ సేవలు అందిస్తోంది.
‘‘ఎస్‌ఎంసీ కొనుగోలుతో జీసీసీ నైపుణ్యాలు మరింత బలపడతాయి. ఎస్‌ఎంసీ నైపుణ్యాలు మధ్య స్థాయి జీసీసీ విభాగంలో మా మార్కెట్ విస్తరణకు దోహదపడతాయి. ఎస్‌ఎంసీ సేవలను మా విస్తృతమైన క్లయింట్లకు ఆఫర్ చేస్తాం’’అని హెక్సావేర్ టెక్నాలజీస్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు సమాచారం ఇచి్చంది.
జోహో నుంచి ఎల్‌ఎల్‌ఎం
దేశీ టెక్నాలజీ సంస్థ జోహో (Zoho) తమ స్వంత లార్జ్ ల్యాంగ్వేజ్ (ఎల్‌ఎల్‌ఎం) మోడల్‌ను ప్రవేశపెట్టింది. తమ ఉత్పత్తులను ఉపయోగించే సంస్థల కోసం దీన్ని డిజైన్ చేసినట్లు కంపెనీ తెలిపింది. ఎన్‌విడియాకు చెందిన ఏఐ కంప్యూటింగ్ ప్లాట్‌ఫాంను ఉపయోగించి దీన్ని తాము అంతర్గతంగా తయారు చేసినట్లు పేర్కొంది. ఇంగ్లీష్, హిందీలో మాటలను ఆటోమేటిక్‌గా టెక్ట్స్ కింద మార్చే మోడల్స్‌ను కూడా ప్రవేశపెడుతున్నట్లు వివరించింది. దీన్ని ఇతర భారతీయ, యూరోపియన్ భాషలకు కూడా విస్తరిస్తామని తెలిపింది.