
సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు
రూ. 1,200 కోట్లపై కన్ను
న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల తయారీ కంపెనీ హీరో మోటార్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఐపీవో ద్వారా రూ. 1,200 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 285 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 237 కోట్లు ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ ప్లాంటు విస్తరణకు అవసరమైన మెషీనరీ, పరికరాల కొనుగోళ్లకు వెచ్చించనుంది.
మరికొన్ని నిధులను ఇతర సంస్థల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఇంతక్రితం కంపెనీ 2024 ఆగస్ట్‌లోనూ పబ్లిక్ ఇష్యూకి సిద్ధపడింది. రూ. 900 కోట్ల సమీకరణకు ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. అయితే అక్టోబర్‌లో ప్రాస్పెక్టస్‌ను వెనక్కి తీసుకుంది. కంపెనీ ప్రధానంగా అత్యున్నత ఇంజినీర్డ్ పవర్‌ట్రెయిన్ సొల్యూషన్లు రూపొందిస్తోంది. దేశ, విదేశీ ఆటోమోటివ్ టెక్నాలజీ దిగ్గజాలకు కంపెనీ ప్రొడక్టులు సమకూర్చుతోంది. క్లయింట్లలో భారత్‌సహా యూఎస్, యూరప్, దక్షిణాసియా ప్రాంత దిగ్గజాలున్నాయి.
వీటిలో బీఎండబ్ల్యూ ఏజీ, డుకాటి మోటార్ హోల్డింగ్ ఎస్‌పీఏ, హమ్మింగ్‌బర్డ్ ఈవీ, ఎన్వియోలో ఇంటర్నేషనల్ ఇంక్, ఫార్ములా మోటార్‌స్పోర్ట్ తదితరాలు చేరాయి. భారత్, యూకే, థాయ్‌లాండ్‌లలో ఆరు తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 1,064 కోట్లను అధిగమించింది. నికర లాభం రూ. 17 కోట్లుగా నమోదైంది.
లిస్టింగ్‌కు స్కైవేస్ ఎయిర్ సర్విసెస్
సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు
వైమానిక రవాణా ఫార్వార్డింగ్, లాజిస్టిక్స్ కంపెనీ స్కైవేస్ ఎయిర్ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు అనుమతించమంటూ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా 32.92 మిలియన్ ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 13.33 మిలియన్ షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు.
ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 217 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 130 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, మరికొన్ని నిధులు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. 1984లో ఏర్పాటైన కంపెనీ కస్టమ్ హౌస్ ఏజెంట్‌గా కార్యకలాపాలు ప్రారంభించి తదుపరి సర్విసులను విస్తరించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,289 కోట్ల ఆదాయం, రూ. 34.5 కోట్ల నికర లాభం ఆర్జించింది.