క్రెడిట్‌ కార్డుల్లో మళ్లీ విజృంభిస్తాం

HDFC Bank Has Road Map For A big Comeback In Cards - Sakshi

ముంబై: కొత్త క్రెడిట్‌ కార్డుల జారీపై రిజర్వ్‌ బ్యాంక్‌ నిషేధం విధించడం వల్ల మార్కెట్‌ షేరును పెంచుకోవడంపై ప్రతికూల ప్రభావం పడిందని ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ డిజిటల్‌ బ్యాంకింగ్, ఐటీ, కన్జూమర్‌ ఫైనాన్స్‌ విభాగాల హెడ్‌ పరాగ్‌ రావు తెలిపారు. అయితే, తాత్కాలికమైన ఆంక్షలు తొలగిపోయిన తర్వాత మళ్లీ మార్కెట్లో మళ్లీ దూకుడుగా తిరిగొస్తామని, నష్టాన్ని భర్తీ చేసుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

పరిస్థితులను సమీక్షించుకునేందుకు, కొత్త ఆవిష్కరణలను రూపొందించేందుకు గత ఆరు నెలల కాలాన్ని తాము ఉపయోగించుకున్నట్లు పరాగ్‌ వివరించారు. నిషేధం ఎత్తివేసిన 3–4 నెలల్లోనే మళ్లీ తాము మార్కెట్‌ వాటాను కొల్లగొట్టగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కొత్త ఉత్పత్తులు, ఫీచర్లను ప్రవేశపెట్టడంతో పాటు నిషేధ సమయంలో కుదుర్చుకున్న భాగస్వామ్య ఒప్పందాలను అమల్లోకి తెస్తామని ఆయన వివరించారు.  

గడిచిన రెండేళ్లుగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతుండటాన్ని సీరియస్‌గా తీసుకున్న రిజర్వ్‌ బ్యాంక్‌ .. గత డిసెంబర్‌లో బ్యాంకుపై అసాధారణంగా పెనాల్టీలు విధించిన సంగతి తెలిసిందే. కొత్త క్రెడిట్‌ కార్డుల జారీ, కొత్త డిజిటల్‌ ఆవిష్కరణలపైన నిషేధం విధించింది. దీంతో రిజర్వ్‌ బ్యాంక్‌ సూచనల మేరకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తమ సిస్టమ్‌లను అప్‌గ్రేడ్‌ చేసుకోవడంపై మరింతగా దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించిన తక్షణ, స్వల్ప, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలను ఆర్‌బీఐకి సమర్పించినట్లు పరాగ్‌ రావు తెలిపారు. ఆర్‌బీఐ నుంచి సానుకూల నిర్ణయం రాగలదని ఆశిస్తున్నట్లు వివరించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top