దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)ను పలు కాలపరిమితులపై 5 నుంచి 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. కొత్త రేట్లు జూన్ 8, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో ఎంసీఎల్‌ఆర్ ఆధారిత గృహ, వ్యక్తిగత, వాహన రుణాలు తీసుకున్న కొందరు కస్టమర్లకు భవిష్యత్తులో ఈఎంఐలు (EMI) పెరిగే అవకాశం ఉంది.
ఆర్బీఐ రెపో రేటు స్థిరంగానే.. అయినా పెంపు ఎందుకు?
గత వారం జరిగిన ద్రవ్య విధాన సమీక్షలో ఆర్బీఐ రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా కొనసాగించింది. అయితే బ్యాంకుల నిధుల సమీకరణ వ్యయం, డిపాజిట్ ఖర్చులు, మార్కెట్ పరిస్థితులు వంటి అంశాల ఆధారంగా ఎంసీఎల్‌ఆర్‌ను బ్యాంకులు స్వతంత్రంగా నిర్ణయిస్తాయి. అందుకే రెపో రేటులో మార్పు లేకపోయినా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన అంతర్గత బెంచ్‌మార్క్ రేట్లను సవరించింది.
ఏయే కాలపరిమితుల్లో ఎంత పెరిగింది?
సవరించిన ఎంసీఎల్‌ఆర్ రేట్ల ప్రకారం ఓవర్‌నైట్ రేటు 8.05 శాతం నుంచి 8.10 శాతానికి పెరిగింది. మూడు నెలల ఎంసీఎల్‌ఆర్ 8.15 శాతం నుంచి 8.20 శాతానికి, ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్ 8.30 శాతం నుంచి 8.35 శాతానికి చేరింది.
రిటైల్ రుణాలకు కీలక బెంచ్‌మార్క్‌గా భావించే ఒక సంవత్సరం ఎంసీఎల్‌ఆర్ 8.35 శాతం నుంచి 8.40 శాతానికి పెరిగింది. రెండేళ్ల ఎంసీఎల్‌ఆర్‌లో అత్యధికంగా 10 బేసిస్ పాయింట్ల పెంపు చోటుచేసుకుని 8.45 శాతం నుంచి 8.55 శాతానికి చేరగా, మూడేళ్ల ఎంసీఎల్‌ఆర్ 8.60 శాతం నుంచి 8.65 శాతానికి పెరిగింది. ఒక నెల ఎంసీఎల్‌ఆర్ మాత్రం 8.05 శాతం వద్ద యథాతథంగా కొనసాగింది.
తాజా ఎంసీఎల్‌ఆర్ రేట్లు
🔹 ఓవర్‌నైట్ – 8.10%
🔹 1 నెల – 8.05%
🔹 3 నెలలు – 8.20%
🔹 6 నెలలు – 8.35%
🔹 1 సంవత్సరం – 8.40%
🔹 2 సంవత్సరాలు – 8.55%
🔹 3 సంవత్సరాలు – 8.65%
ఈఎంఐలు వెంటనే పెరుగుతాయా?
అలా ఏం లేదు. ఎంసీఎల్‌ఆర్‌కు అనుసంధానమైన రుణాల్లో వడ్డీ రేటు ప్రతి నెల, త్రైమాసికం లేదా వార్షిక రీసెట్ తేదీకి అనుగుణంగా మారుతుంది. కాబట్టి మీ రుణ ఖాతాకు తదుపరి రీసెట్ తేదీ వచ్చినప్పుడు మాత్రమే కొత్త ఎంసీఎల్‌ఆర్ ప్రభావం కనిపిస్తుంది. ఈఎంఐ పెరగవచ్చు లేదా రుణ కాలపరిమితి పొడిగించవచ్చు. ఇది రుణ ఒప్పంద నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.
అసలేమిటీ ఎంసీఎల్‌ఆర్?
ఎంసీఎల్‌ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్) అనేది బ్యాంకు రుణాలను ఇవ్వగల కనీస వడ్డీ రేటు. 2016లో ఆర్బీఐ ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. బ్యాంకు నిధుల వ్యయం, నిర్వహణ ఖర్చులు, నగదు నిల్వల వ్యయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని దీనిని నిర్ణయిస్తారు. అనేక పాత గృహ, వ్యక్తిగత, వాహన రుణాలు ఇప్పటికీ ఎంసీఎల్‌ఆర్ ఆధారంగానే కొనసాగుతున్నాయి.
బేస్ రేట్, బీపీఎల్‌ఆర్ యథాతథం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బేస్ రేట్ ప్రస్తుతం 8.80 శాతంగా కొనసాగుతోంది. అలాగే బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ (BPLR) 17.30 శాతంగా ఉంది. ఈ రేట్లు డిసెంబర్ 26, 2025 నుంచి అమల్లో ఉన్నాయి.
రుణగ్రహీతలు ఏం చేయాలి?
మీ హోమ్ లోన్ లేదా ఇతర రుణం ఎంసీఎల్‌ఆర్ ఆధారితమా, లేక EBLR/రెపో-లింక్డ్ విధానంలో ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. ఎంసీఎల్‌ఆర్ ఆధారిత రుణాలు ఉన్నవారు తమ తదుపరి రీసెట్ తేదీని పరిశీలించి ఈఎంఐపై పడే ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసుకోవచ్చు. రెపో-లింక్డ్ రుణాలపై ఈ తాజా ఎంసీఎల్‌ఆర్ పెంపు ప్రత్యక్ష ప్రభావం చూపదు.


