
జీఎస్టీ సంస్కరణలు సెప్టెంబర్ 22నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో నిత్యావసర వస్తువులు, ఔషధాల ధరలు మాత్రమే కాకుండా.. కార్లు, ఎలక్ట్రానిక్స్ ధరలు కూడా తగ్గాయి. ఈ పన్నులు భవిష్యత్తులో మరింత తగ్గుతాయని దేశ ప్రధాని వెల్లడించారు. గ్రేటర్ నోయిడాలో జరిగిన ఉత్తరప్రదేశ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 2025 కార్యక్రమంలో నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 2025కు రష్యా భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో నరేంద్ర మోదీ.. రష్యా, భారత్ బంధం గురించి కూడా ప్రస్తావించారు. స్వదేశీ రక్షణ ఉత్పత్తిని పెంచడంలో ఉత్తరప్రదేశ్ గణనీయమైన పాత్ర పోషిస్తోందని మోదీ పేర్కొన్నారు. రష్యా సహకారంతో ఏర్పాటు చేసిన కర్మాగారంలో ఏకే-203 రైఫిల్స్ ఉత్పత్తి త్వరలో ప్రారంభమవుతుందని అన్నారు.
భారతదేశ స్వయం సమృద్ధిలో ఉత్తరప్రదేశ్ పాత్ర చాలా ఉంది. దేశంలో తయారవుతున్న మొత్తం ఫోన్లలో 50 శాతం కంటే ఎక్కువ యూపీ నుంచే వస్తున్నాయి. అంతే కాకుండా మన దేశంలోనే అన్నింటిని ఉత్పత్తి చేసుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో ఒక రక్షణ కారిడార్‌ను అభివృద్ధి చేస్తున్నామని, అక్కడ బ్రహ్మోస్ క్షిపణులు, ఇతర ఆయుధ వ్యవస్థల తయారీ ఇప్పటికే ప్రారంభమైందని మోదీ వెల్లడించారు.
ఇదీ చదవండి: 'జీఎస్టీ తగ్గినా.. ధరలు తగ్గలేదు': ఫిర్యాదులపై స్పందించిన కేంద్రం
పన్నులను తగ్గిస్తూనే ఉంటాము
జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలను కూడా ఈ సందర్భంగా మోదీ హైలైట్ చేశారు. కొత్త జీఎస్టీ అమలులోకి రావడంతో.. సాధారణ కుటుంబాలు ప్రతినెలా కొంత ఎక్కువ పొదుపు చేసుకోగలుగుతారని అన్నారు. కాగా జీఎస్టీ సంస్కరణల ప్రచారంపై కాంగ్రెస్ విమర్శలు చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూనే.. పన్నులను తగ్గిస్తూనే ఉంటాము. జీఎస్టీ సంస్కరణల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఆయన అన్నారు.