పెరుగుతున్న నిపుణుల కొరత.. | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న నిపుణుల కొరత..

Published Tue, Jan 2 2024 6:21 AM

A growing skills gap in the IT sector - Sakshi

ముంబై: ఐటీ కంపెనీలు నైపుణ్యాల కొరతను ఎదుర్కొంటుండగా, కృత్రిమ మేథ (ఏఐ) దీన్ని మరింత వేగవంతం చేస్తున్నట్టు ఎడ్‌టెక్‌ కంపెనీ స్కిల్‌సాఫ్ట్‌ నిర్వహించిన ‘2023 ఐటీ స్కిల్స్‌ అండ్‌ శాలరీ సర్వే’లో తెలిసింది. అర్హత కలిగిన నిపుణులు లభించడం కష్టంగా ఉందని ప్రతి ముగ్గురు ఐటీ కంపెనీల ప్రతినిధుల్లో ఒకరు చెప్పారు. నైపుణ్యాల అంతరం, నైపుణ్యాల కొరత, టెక్నాలజీల్లో మార్పు ఐటీ విభాగాలను ప్రభావితం చేస్తున్నట్టు ఈ సర్వే నివేదిక తెలిపింది.

‘‘ఉద్యోగులకు ఇంతకుముందెన్నడూ లేనట్టు తరచూ మారుతున్న టెక్నాలజీలపై శిక్షణ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఏఐ తదితర టెక్నాలజీకి సంబంధించిన నైపుణ్యాలు, సామర్థ్యాల నిర్మాణంలో సంస్థలు చురుగ్గా వ్యవహరించాల్సిన దశలో ఉన్నాయి’’అని స్కిల్‌సాఫ్ట్‌ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ ఓర్లా డ్యాలీ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 5,700 మంది ఐటీ నిపుణులు, కంపెనీల ప్రతినిధుల అభిప్రాయాలను ఈ సర్వేలో భాగంగా స్కిల్‌సాఫ్ట్‌ తెలుసుకుంది.

శిక్షణ ఎంతో అవసరం..  
82 శాతం ఐటీ నిపుణులు శిక్షణ తమ కెరీర్‌లో ఎంతో ముఖ్యమని చెప్పారు. చేస్తున్న పనిలో ఎలాంటి వృద్ధి లేకపోవడం వల్ల తాము సంస్థను మారాల్సి వచి్చనట్టు ఎక్కువ మంది తెలిపారు. టీమ్‌ కమ్యూనికేషన్‌ (40 శాతం), ఇంటర్‌పర్సనల్‌ కమ్యూనికేషన్‌ (21 శాతం), ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ (13) అన్నవి కావాల్సిన మూడు ముఖ్యమైన నైపుణ్యాలుగా ఐటీ రంగ ఉద్యోగులు చెప్పారు.

రానున్న రోజుల్లో నాయకత్వ నైపుణ్యాలు కూడా తమ పెట్టుబడుల ప్రాధాన్యతల్లో ఒకటిగా 6 శాతం మంది పేర్కొన్నారు. సాంకేతికేతర నైపుణ్యాల అవసరాన్ని 7 శాతం మంది వ్యక్తం చేశారు. 72 శాతం మంది ఐటీ ఉద్యోగులు తమ టీమ్‌ నాయకత్వ నైపుణ్యాలు మధ్యస్థం నుంచి తక్కువగా ఉన్నట్టు అంగీకరించారు. ఈ విభాగంలో శిక్షణ పరంగా ఎంతో అంతరం ఉన్నట్టు పేర్కొన్నారు. నాయకత్వంలో శిక్షణ ఇవ్వడం ద్వారా సమగ్రమైన ఐటీ నైపుణ్యాలు సమకూర్చుకునేందుకు ఇప్పుడు పెద్ద అవకాశం కంపెనీల మందున్నట్టు ఈ సర్వే నివేదిక పేర్కొంది.

Advertisement
Advertisement