
ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థలు, బ్యాంకుల్లో మేనేజింగ్ డైరక్టర్లుగా విధులు నిర్వహిస్తున్న వారి రిటైర్మెంట్ వయస్సును పొడిగించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ చైర్మన్‌ల రీటైర్మెంట్ వయస్సును 65కి పొడిగించనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
కేంద్రం సంబంధిత శాఖలతో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) చీఫ్‌ల పదవీ విరమణ వయో పరిమితిని పెంచే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో పీఎస్‌బీల మేనేజింగ్ డైరెక్టర్ల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచడంపై చర్చలు జరుగుతున్నాయని సమాచారం.
దినేష్ ఖారా రీటైర్మెంట్ పొడిగింపు?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ దినేష్ ఖరా పదవీ కాలాన్ని కూడా పొడిగించే అవకాశం ఉందని పీటీఐ నివేదించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) మేనేజింగ్ డైరెక్టర్ల పదవీ విరమణ వయో పరిమితిని ప్రస్తుత 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచాలని యోచిస్తోందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
2020 నుంచి దినేష్ ఖారా ఎస్‌బీఐ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుత నిబందనల ప్రకారం.. ఖరా వచ్చే ఏడాది ఆగస్టులో పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం అతని వయస్సు 63 సంవత్సరాలు. కానీ ఇప్పుడు పదవీ విరమణ వయస్సు పెంపుతో ఆయన ఎస్‌బీఐ చైర్మన్‌గా మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉంది. అలాగే ఇతర సంస్థల్లో డైరెక్టర్లగా పనిచేస్తున్న వారి పదవీ విరమణ వయస్సు పొడిగింపుపై ప్రణాళికలు, చర్చలు మినహా, మిగిలిన అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ అంశంపై తుది నిర్ణయం కేంద్రానిదే.
ఎల్‌ఐసీ చైర్‌పర్సన్
జూన్ 29, 2024 వరకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) చైర్‌పర్సన్‌గా సిద్ధార్థ మొహంతిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత, జూన్ 7, నుంచి 2025 వరకు మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా తన పదవిలో కొనసాగనున్నారు. ఎల్‌ఐసీకి ఎం జగన్నాథ్, టేబల్‌ష్ పాండే, మినీ ఐపీ అనే ముగ్గురు మేనేజింగ్ డైరెక్టర్లు ఉన్నారు. ఎండీల పదవీ విరమణ వయస్సు పొడిగింపు వారి పదవీకాలాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.