దేశంలోని ప్రభుత్వ రంగ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ అయిన సెమీకండక్టర్ ల్యాబొరేటరీ (ఎస్‌సీఎల్)ను వచ్చే మూడేళ్లలో పూర్తిగా ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.4,500 కోట్లు వెచ్చించనుంది. ఈమేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వివరాలు వెల్లడించారు.
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మైటీ) ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్త సంస్థ అయిన ఎస్‌సీఎల్ ప్రస్తుతం అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు (ASICs), ఆప్టో ఎలక్ట్రానిక్స్ పరికరాలు, ఎంఈఎంఎస్ పరికరాలకు ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ అందిస్తోంది. ఈ సదుపాయం దేశంలోని ఏకైక ఇంటిగ్రేటెడ్ డివైస్ తయారీ యూనిట్‌గా గుర్తింపు పొందింది.
‘రూ.76,000 కోట్ల ఇండియా సెమీకండక్టర్ మిషన్‌లో భాగంగా ఈ రూ.4,500 కోట్ల పెట్టుబడి తోడ్పడుతుంది. ఎస్‌సీఎల్ ఉత్పత్తిని మూడేళ్లలో 100 రెట్లు పెంచాలి’ అని మంత్రి అన్నారు. ప్లాంట్ విస్తరణ కోసం 25 ఎకరాల భూమిని కేటాయించాలని కేంద్రం పంజాబ్ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ‘పంజాబ్ ప్రభుత్వం ఎంత త్వరగా భూమి కేటాయిస్తే అంత త్వరగా ఎస్‌సీఎల్ విస్తరణ పూర్తవుతుంది. ఆధునీకరణ పనుల కోసం ఇప్పటికే టెండర్లు జారీ చేశాం’ అని మంత్రి అన్నారు. ప్రస్తుతం 180 నానోమీటర్ నోడ్‌లో చిప్‌లు తయారు చేస్తున్న ఎస్‌సీఎల్‌ను స్టార్టప్‌లకు ‘టేప్ అవుట్ ఫెసిలిటీ’గా మార్చనున్నారు.


