ఎల్‌ఐసీకి ప్రభుత్వ మినహాయింపు | Sakshi
Sakshi News home page

ఎల్‌ఐసీకి ప్రభుత్వ మినహాయింపు

Published Fri, Dec 22 2023 7:07 AM

Govt grants one time exemption to LIC to achieve 25pc MPS in 10 years - Sakshi

న్యూఢిల్లీ: పబ్లిక్‌కు కనీస వాటా విషయంలో ప్రభుత్వం మినహాయింపునిచ్చినట్లు బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్‌ఐసీ వెల్లడించింది. దీంతో పబ్లిక్‌కు కనీసం 25 శాతం వాటా(ఎంపీఎస్‌) కల్పించే అంశంలో పదేళ్ల గడువు లభించినట్లు తెలియజేసింది. 2022 మే నెలలో ఐపీవో ద్వారా ప్రభుత్వం ఎల్‌ఐసీలో 3.5 శాతం వాటా(22.13 కోట్ల షేర్లు)ను విక్రయించింది.

దీంతో ప్రస్తుతం ప్రభుత్వ వాటా 96.5 శాతంగా కొనసాగుతోంది. నిజానికి ఐపీవో తదుపరి నిర్ధారిత గడువులోగా లిస్టెడ్‌ కంపెనీలు పబ్లిక్‌కు 25 శాతం వాటాను కల్పించవలసి ఉంది. అయితే ఆర్థిక వ్యవహారాల శాఖ ఒకేసారి పదేళ్లవరకూ మినహాయింపునిచ్చినట్లు ఎల్‌ఐసీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. వెరసి 2032 మే వరకూ పబ్లిక్‌కు 25 శాతం వాటా కల్పించే అంశంలో వెసులుబాటు లభించినట్లు తెలియజేసింది. కాగా.. ఈ ఏడాది(2023) మొదట్లో ప్రభుత్వం బ్యాంకులుసహా లిస్టెడ్‌ పీఎస్‌యూలు పబ్లిక్‌కు కనీస వాటా కల్పించే విషయంలో నిబంధనల్లో సవరణలు చేపట్టింది.

తద్వారా ప్రైవేటైజేషన్‌ తదుపరి ప్రభుత్వ రంగ సంస్థలు ఎంపీఎస్‌ను అమలు చేయవలసిన అవసరాన్ని తప్పించింది. తొలుత పీఎస్‌యూలకు మాత్రమే ఇందుకు వీలుండగా.. ప్రభుత్వ వాటా విక్రయం తదుపరి సైతం వర్తించేలా ఈ ఏడాది జనవరిలో నోటిఫై చేసింది. దీంతో ప్రభుత్వ రంగ కంపెనీలలో వాటా కొనుగోలుకి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపేందుకు వీలు చిక్కింది. 2021 జూలైలోనే ప్రభుత్వం అన్ని పీఎస్‌యూలకూ ఎంపీఎస్‌ వర్తించేలా నోటిఫికేషన్‌ను జారీ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement