విదేశాల్లో బంధువులున్నారా? మీకో గుడ్‌న్యూస్‌: నిబంధనలు మారాయ్‌!

Govt Amends FCRA Rules Allows Relatives Living Abroad To Send Up To Rs 10 Lakh To Indians - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: విదేశీ విరాళాల స్వీకరణ నియంత్రణ (ఎఫ్‌సీఆర్‌ఏ) చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా సవరించింది. ఈ మేరకు విదేశాలలో నివసిస్తున్న భారతీయులు, వారి బంధువులకు శుభవార్త అందించింది. తాజా సవరణతో ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం అం‍దించాల్సిన అవసరం లేకుండానే పది లక్షల రూపాయల వరకు  భారతీయ బంధువులకు, కుటుంబీకులకు విదేశాల్లో ఉంటున్న వారు పంపించుకోవచ్చు.  ఇప్పటివరకు ఈ పరిమితి కేవలం లక్ష రూపాయలు మాత్రమే. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం రాత్రి నోటిఫికేషన్‌ జారీ చేసింది.

అంతేకాదు సవరించిన నిబంధనల ప్రకారం, లబ్ధిదారులు ఏడాదిలో రూ.10 లక్షలకు మించి  నిధులు అందిన 90 రోజుల్లోగా ప్రభుత్వానికి అధికారికంగా వెల్లడించేలా నిబంధనలు మార్చింది.   ఇప్పటివరకు ఈ వ్యవధి  30 రోజులు మాత్రమే. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఎ)కి సంబంధించిన కొన్ని నిబంధనలను మంత్రిత్వ శాఖ సవరించింది.  దీనికి సంబంధించిన ఫారిన్ కాంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) సవరణ నిబంధనలు, 2022 గెజిట్ నోటిఫికేషన్‌ను హోం మంత్రిత్వ శాఖ  విడుదల చేసింది. 

కాగా విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టం 2011లో, రూల్ 6  ప్రకారంలో  ఏ వ్యక్తి అయినా తన బంధువుల నుండి ఒక ఆర్థిక సంవత్సరంలో లక్ష కంటే ఎక్కువ లేదా దానికి సమానమైన విదేశీ విరాళాన్ని స్వీకరిస్తే, అటువంటి సహకారం అందిన 30 రోజులలోపు కేంద్రానికి వివరాలు  తెలియజేయాల్సి ఉండింది.  ప్రస్తుత నిబంధన ప్రకారం  10 లక్షలకు  మించి విదేశీ నిధులను స్వీకరిస్తే 90 రోజులలోపు సమాచారాన్ని  కేంద్రానికి అందించాలి.

అదేవిధంగా, ఎఫ్‌సీఆర్‌ఏ నిధులను స్వీకరించడానికి 'రిజిస్ట్రేషన్' లేదా 'ముందస్తు అనుమతి' పొందే నిబంధన 9కి కూడా మార్పులు చేసింది. సంబంధిత వ్యక్తులు, సంస్థలు లేదా ఎన్జీవోలు తమకు అందిన నిధులు, బ్యాంకు ఖాతా సమాచారాన్ని హోంమంత్రిత్వ శాఖకు అందించే గడువు 45 రోజులకు పెంచింది. ఇప్పటివరకు ఇది  30 రోజులు మాత్రమే.

ఎన్జీవోలు లేదా సంస్థలు, వ్యక్తులు విదేశీ నిధులను స్వీకరణకు సంబంధించి తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రతీ త్రైమాసికంలో వివరాలను అందించాలనే మరో నిబంధనను కూడా తొలగించింది.  ఒక వేళ బ్యాంకు ఖాతా, పేరు, చిరునామా లేదా విదేశీ నిధులు మారిన పక్షంలో, ఆ సమాచారాన్ని మునుపటిలా 15 రోజుల ముందు కాకుండా 45 రోజులలోపు అందించాలి. అలాగే ఆయా నిధుల వినియోగంపై ఆడిటెడ్ స్టేట్‌మెంట్‌ అందించడానికి  ఆర్థిక సంవత్సరం  ముగిసినప్పటి నుంచి 9 నెలల సమయం ఉంటుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top