
కృత్రిమ మేధ సహాయంతో కంపెనీ ఉత్పాదకతను మరింత పెంచాలని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఉద్యోగులతో జరిగిన సమావేశంలో స్పష్టం చేశారు. అసాధారణ పెట్టుబడి వ్యూహాలు ఉన్నప్పుడు ఉత్పాదకత కూడా అందుకు తగినట్లుగా మారాలని చెప్పారు. అందుకు కృత్రిమ మేధను మరింత మెరుగ్గా ఉపయోగించుకోవాలని సూచించారు. అందుకోసం కంపెనీ అంతర్గతంగా కొన్ని మోడల్స్‌ను ఆవిష్కరించినట్లు చెప్పారు.
‘ఉత్పాదకతను పెంచడానికి మనం మరింత సాధించాలని అనుకుంటున్నాను. మరింత సమర్థవంతంగా పనిచేయడానికి ప్రయత్నిద్దాం. గూగుల్ ప్రస్తుత పనితీరుపై ఆశావహంగా ఉన్నాను’ అని సుందర్ తెలిపారు. ఈ సమావేశంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల (ఎస్‌డబ్ల్యూఈ) కోసం కంపెనీ అభివృద్ధి చేస్తున్న కొన్ని సాధనాలను వివరించారు. కంపెనీ అవసరాలను తీర్చడానికి కృత్రిమ మేధను మరింత వేగంగా, అత్యవసరంగా కోడింగ్ వర్క్‌ఫ్లోలో అమలు చేయాలని చెప్పారు. దీనిద్వారా పనిలో వేగం పెరుగుతుందన్నారు.
ఇదీ చదవండి: మెటా తీరుతో ఇతర కంపెనీలు సర్వనాశనం
గూగుల్ ఫ్లాగ్‌షిప్ ఉత్పత్తుల కోసం టెక్నికల్ ఫౌండేషన్ బృందాలకు నేతృత్వం వహిస్తున్న బ్రియాన్ సలుజో ‘ఏఐ-సావీ’ని రూపొందించినట్లు చెప్పారు. ఏఐ సావీ గూగుల్.. కోర్సులు, టూల్‌కిట్లు, ప్రొడక్ట్ స్పెసిఫిక్ లెర్నింగ్ సెషన్‌లను అందించే ఒక అంతర్గత వేదికగా ఉంటుంది. ఈ సమావేశంలో గూగుల్ జెమినీ మోడల్స్‌తో ఇంజినీర్లకు సహాయపడటానికి డీప్ మైండ్‌తో అభివృద్ధి చేసిన శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు.