
కృత్రిమ మేధస్సు(ఏఐ) విభాగంలో కొత్త ఆవిష్కరణలు చేసేలా ప్రపంచవ్యాప్తంగా టాలెంట్ హంటింగ్ అనూహ్య స్థాయికి చేరుకుంది. ఓపెన్ఏఐ అగ్ర నిపుణులను ఆకర్షించడానికి మెటా 100 మిలియన్ డాలర్ల(సుమారు రూ.870 కోట్లు) బోనస్‌ను సైతం ఆఫర్ చేస్తున్న తరుణంలో ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ తన ఉద్యోగులకు పంపిన అంతర్గత ఈమెయిల్ వైరల్‌గా మారింది. మెటా వంటి పోటీదారుల నుంచి వచ్చే వేతన ఆఫర్లు కంపెనీల సంస్కృతిని నాశనం చేస్తాయని అంతర్గత ఈమెయిల్‌లో అమోడీ తెలిపారు.
ఇతర కంపెనీలు ఆఫర్ చేసే ఆర్థిక ప్రోత్సాహకాల కంటే ఆంత్రోపిక్ తన మిషన్ పట్ల నిబద్ధతగా వ్యవహరించాలని ఆయన ఉద్యోగులను కోరారు. మెటా అసాధ్యాన్ని సాధ్యం చేయాలనే తప్పుడు ఆలోచనతో ఉందన్నారు. మెటా తీరు ఇతర కంపెనీల సంస్కృతిని నాశనం చేసేలా ఉందని అంతర్గత ఈమెయిల్‌లో అమోడీ తెలిపారు. ఆంత్రోపిక్ ఉద్యోగులకు వేతన ఆఫర్ల కంటే కంపెనీ మిషన్ ప్రధానమని చెప్పారు. మెటా ఆఫర్ చేస్తున్న ప్యాకేజీల కారణంగా సంస్థాగత సమగ్రతను కాపాడుకుంటూ కీలక ప్రతిభావంతులను నిలుపుకోవడంపై పరిశ్రమలో ఇతర కంపెనీలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తుంది.
ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటలిజెన్స్(ఏజీఐ)ను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్(ఎంఎస్ఎల్) అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ విభాగంలో పనిచేసే మెటా ఏఐ మోడల్, ఉత్పత్తి బృందాలు ఫండమెంటల్ ఏఐ రీసెర్చ్(ఫెయిర్)ను అభివృద్ధి చేస్తాయని చెప్పారు. ఎంఎస్ఎల్ కింద కొత్త ల్యాబ్ తదుపరి తరం లార్జ్ ల్యాంగ్వేజ్ మోడళ్ల (ఎల్ఎల్ఎం) నిర్మాణంపై దృష్టి పెడుతుందని తెలిపారు.
ఇదీ చదవండి: పూర్తిగా వెనక్కి రాని రూ.2,000 నోట్లు
గూగుల్, ఎక్స్, మెటా, ఓపెన్‌ఏఐ.. వంటి ప్రధాన కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐ మోడళ్లను సృష్టిస్తున్నాయి. ఈ సంస్థల మధ్య పోటీ తీవ్రతరం అవుతుంది. దాంతో తోటివారికంటే ఓ అడుగు ముందుడాలనే భావనతో కంపెనీ ఏఐ నైపుణ్యాలున్నవారికి భారీ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. కృత్రిమ మేధస్సుపై ఆధిపత్యం చెలాయించే రేసులో భాగంగా మెటా కీలక ప్రచారం ప్రారంభించినట్లు ఇటీవల కొన్ని సంస్థలు తెలుపుతున్నాయి. ఈ విభాగంలో అగ్రశ్రేణి ఏఐ ప్రతిభావంతులను ఆకర్షించేందుకు భారీ ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు తెలుస్తుంది. మెరుగైన ఏఐ నైపుణ్యాలున్న ఎక్స్‌పర్ట్‌లకు 100 మిలియన్ డాలర్ల (రూ.860 కోట్లు) ప్యాకేజీ చెల్లించేందుకు కూడా వెనుకాడడం లేదని సమాచారం.