సాహో భారతీయుడా.. త్వరలోనే బిలియనీర్​గా సుందర్​ పిచాయ్​! | Sakshi
Sakshi News home page

సాహో భారతీయుడా.. త్వరలోనే బిలియనీర్​గా సుందర్​ పిచాయ్​!

Published Wed, May 1 2024 6:32 PM

Google CEO Sundar Pichai Nears Billionaire Status

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ మరో అరుదైన ఘనతను సాధించేందుకు అడుగు దూరంలో ఉన్నారు. చెన్నైలో రెండు గదుల ఇంటి నుంచి ప్రారంభమైన పిచాయ్‌ ప్రస్థానం 100 కోట్ల డాలర్ల సంపదతో బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ టాప్‌ టెన్‌ బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించుకోనున్నారు. ఇదే విషయాన్ని బ్లూమ్‌ బెర్గ్‌ తెలిపింది.  

ఇప్పటి వరకు టెక్నాలజీ కంపెనీ అధినేతలు మాత్రమే బ్లూమ్‌ బెర్గ్‌ బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. కానీ తొలిసారి సాధారణ ఉద్యోగిలా గూగుల్‌లో చేరి తన అసాధారణమైన పనితీరుతో సీఈఓ స్థాయికి ఎదిగిన సుందర్ పిచాయ్ బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ జాబితాలో చోటు దక్కించుకోనున్నారు.    

గూగుల్‌లో ప్రొడక్ట్‌ మేనేజర్‌గా
గూగుల్‌లో ప్రొడక్ట్‌ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించి సంస్థ అసాధారణమైన పనితీరుతో గూగుల్‌ యాజమాన్యం తనకు దాసోహమయ్యేలా చేసుకున్నారు. ముఖ్యంగా గూగుల్ క్రోమ్, గూగుల్ టూల్ బార్స్​ను అందుబాటులోకి తెచ్చి ఔరా అనిపించుకున్నారు.

సీఈఓ అనే సింహాసనం మీద
అందుకు ప్రతిఫలంగా సుందర్‌ పిచాయ్‌కు గూగుల్‌ యాజమాన్యం సీఈఓ అనే సింహాసనం మీద కూర్చోబెట్టింది. 2015లో గూగుల్‌లో సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పటి అమెరికన్‌ స్టాక్‌ మార్కెట్లైన ఎస్‌ అండ్‌ పీ 500, నాస్‌ డాక్‌లలో గూగుల్‌ షేర్లను పరుగులు పెట్టేలా చేశారు. అదే సమయంలో సుందర్‌ పిచాయ్‌కు గూగుల్‌ యాజమాన్యం అందించిన జీతాలు, ఇతర భత్యాలు, షేర్లు సైతం భారీ లాభాల్ని ఒడిసి పట్టుకున్నాయి. ఈ తొమ్మిదేళ్లలో సంస్థ విలువతో పాటు సుందర్‌ పిచాయ్‌ ఆదాయం భారీగా పెరిగింది.  

త్వరలో  బిలీయనీర్
పలు నివేదికల ప్రకారం.. గూగుల్‌తో పాటు గూగుల్‌ పేరెంట్ కంపెనీ ‘ఆల్ఫాబెట్' షేరు విలువ దాదాపు 400 శాతం కంటే ఎక్కువ పెరిగింది. ప్రత్యేకించి గూగుల్‌కు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ యూనిట్‌‌ గత మూడు నెలల్లో అద్భుతంగా రాణించింది. దీనికి తోడు గూగుల్‌ ఏఐ టూల్స్‌ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. వెరసి ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31 మధ్యకాలానికి సంబంధించిన మొదటి త్రైమాసికంలో ఆల్ఫాబెట్ కంపెనీ అద్భుత ఆర్థిక ఫలితాలను సాధించింది. ఈ పరిణామాలన్నీ కలిసొచ్చి త్వరలోనే సుందర్ పిచాయ్ బిలీయనీర్ కాబోతున్నారని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement