
ఒకే రోజు రూ.1,000 పెరుగుదల
ఢిల్లీ మార్కెట్లో ధర రూ.1,00,020
రూ.3,000 ఎగసిన వెండి ధర
న్యూఢిల్లీ: పుత్తడి మరోసారి జిగేల్‌మంది. కొనుగోళ్ల మద్దతుతో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాముల ధర మంగళవారం ఢిల్లీ మార్కెట్లో రూ.1,000 లాభపడి రూ.1,00,020 స్థాయికి చేరింది. స్టాకిస్టుల నుంచి బలమైన కొనుగోళ్లు జరిగినట్టు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం రూ.1,000 పెరిగి రూ.99,550 స్థాయిని చేరుకుంది.
అటు వెండిలోనూ కొనుగోళ్లు జోరుగా సాగాయి. దీంతో రూ.3,000 లాభపడి కిలోకి రూ.1,14,000 స్థాయిని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో (కామెక్స్ ఫ్యూచర్స్) ఔన్స్ బంగారం 35 డాలర్లకు పైగా లాభంతో 3,440 డాలర్ల స్థాయిని చేరుకుంది. వెండి ధర ఔన్స్‌కు 39.50 డాలర్ల వద్ద ఉంది. పరపతి విధానంపై యూఎస్ ఫెడ్ చైర్మన్ పావెల్ ప్రసంగం కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా వేచి చూస్తున్నట్టు అబాన్స్ ఫైనాన్షియల్ సర్విసెస్ సీఈవో చింతన్ మెహతా తెలిపారు.
చైనా లోన్ ప్రైమ్ రేటుపై నిర్ణయం, యూఎస్ ఆర్థిక డేటా (పీఎం, డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్లు), వడ్డీ రేట్లపై నిర్ణయాలు అంతర్జాతీయంగా బంగారంలో తదుపరి ర్యాలీని నిర్ణయిస్తాయని ఎమ్‌కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్విసెస్ కమోడిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ రియా సింగ్ అభిప్రాయపడ్డారు.