
10 గ్రాములకు రూ.250 పెరుగుదల
న్యూఢిల్లీ: స్టాకిస్టుల నుంచి కొనుగోళ్ల మద్దతుతో బంగారం ధరలు సానుకూలంగా ట్రేడయ్యాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాములకు రూ.250 పెరిగి రూ.99,020 స్థాయిని చేరింది. 99.5 శాతం స్వచ్ఛత పసిడి సైతం ఇంతే మేర లాభపడి రూ.98,550 స్థాయిని తాకింది. మరోవైపు వెండి ధర కిలోకి రూ.500 పుంజుకోవడంతో రూ.1,11,000 స్థాయిని నమోదు చేసింది.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌కు 16 డాలర్ల వరకు పెరిగి 3,365 డాలర్ల స్థాయి వద్ద ట్రేడయ్యింది. ‘‘యూఎస్ టారిఫ్‌లకు సంబంధించి అనిశ్చితులు కొనసాగడంతో బంగారం ధరలు గరిష్టాల వద్ద ట్రేడయ్యాయి. డాలర్ బలపడడం విలువైన లోహాల ధరలకు మద్దతుగా నిలిచింది’’అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.