
న్యూఢిల్లీ: స్వల్ప ఒడిదుడుకులు నెలకొన్నప్పటికీ, బంగారం దిగుమతుల్లో భారత్ తన హవాను కొనసాగిస్తోంది. 2021లో 1,067 టన్నుల దిగుమతులు చేసుకుంది. కోవిడ్–19 తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొన్న 2020లో ఈ పరిమాణం కేవలం 430.11 టన్నులు. 2019తో పోల్చిచూస్తే, 28 శాతం పెరిగి 836.38 టన్నులుగా నమోదయ్యింది. రత్నాలు ఆభరణాల ఎగుమతుల అభివృద్ధి మండలి (జీజేఈపీసీ) నివేదిక ఒకటి అంశాలను వెల్లడించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే..
- స్విట్జర్లాండ్ నుంచి 2021లో అత్యధికంగా 469.66 టన్నుల పసిడి దిగుమతులు జరిగాయి. వరుసలో తరువాతి మూడు స్థానాల్లో యూఏఈ (120.16 టన్నులు), దక్షిణాఫ్రికా (71.68 టన్నులు), గినియా (68.72 టన్నులు) ఉన్నాయి.
- 2015లో దేశం 1,047 టన్నుల పసిడిని దిగుమతి చేసుకోగా, 2017లో 1,032 టన్నుల దిగుమతులు చేసుకుంది. అటు తర్వాత ఈ స్థాయి దిగుమతులు ఇదే తొలిసారి.
- 2021 ఏప్రిల్ నుంచి 2022 ఫిబ్రవరి వరకూ చూస్తే, భారత్ సగటు నెలవారీ పసిడి దిగుమతులు నెలకు 76.57 టన్నులు. 2018–19, 2019–20 ఆర్థిక సంవత్సరం దిగుమతులకు ఇది దాదాపు సరిసమానం. అంటే మొత్తంగా ఈ పరిమాణం 842.28 టన్నులు.
- ఎగుమతుల విషయానికొస్తే, 2021లో బంగారు ఆభరణాలకు డిమాండ్ పెరగడంతో భారతదేశం నుండి ఈ విభాగం నుంచి రవాణా 50 శాతం పెరిగి 8,807.50 మిలియన్ల డాలర్లకు చేరుకుంది. 2020లో ఈ విలువ 5,876.39 మిలియన్ డాలర్లు. ఒక్క స్టడెడ్ గోల్డ్ ఆభరణాల ఎగుమతులు ఇదే కాలంలో 2,508.26 మిలియన్ డాలర్ల నుంచి 5,078.83 మిలియన్ డాలర్లకు ఎగసింది. ప్లెయిన్ గోల్డ్ ఆభరణాల విలువ 3,369.13 మిలియన్ డాలర్ల నుంచి 3,728.66 మిలియన్ డాలర్లకు చేరింది.