
2024–25లో 24 శాతం వృద్ధి
31.8 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ లీజింగ్
వెస్టియన్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: ఆఫీస్ స్పేస్ లీజింగ్ (కార్యాలయ వసతులు) వృద్ధిలో గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీలు) బలమైన పాత్ర పోషిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో జీసీసీలకు ఆఫీస్ స్పేస్ లీజింగ్ 24 శాతం శాతం పెరిగింది. 31.8 మిలియన్ చదరపు అడుగుల (ఎస్‌ఎఫ్‌టీ) కార్యాలయ వసతులను జీసీసీలు గత ఆర్థిక సంవత్సరంలో లీజుకు తీసుకున్నాయి. 2023–24లో జీసీసీలు తీసుకున్న ఆఫీస్ స్పేస్ లీజింగ్ 25.6 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో 31.8 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ లీజింగ్‌లో 13.5 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణాన్ని ఫార్చ్యూన్ 500 కంపెనీలు తీసుకున్నాయి.
అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఫార్చ్యూన్ 500 కంపెనీల లీజింగ్ 10.9 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ కంటే 25 శాతం అధికం. ‘‘గత కొన్ని సంవత్సరాలుగా భారత ఆఫీస్ మార్కెట్‌కు జీసీసీలు ముఖ్య వృద్ధి చోదకంగా నిలుస్తున్నాయి. వ్యయ నియంత్రణ వ్యూహాలు, నైపుణ్య మానవవనరుల లభ్యత, శరవేగంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, సానుకూల ప్రభుత్వ విధానాలు, వ్యాపార సులభతర నిర్వహణ పరిస్థితులు, సానుకూల వ్యాపార వాతావరణం ఇందుకు మద్దతుగా నిలుస్తున్నాయి’’అని వెస్టియన్ నివేదిక వెల్లడించింది.
42 శాతం జీసీసీల నుంచే
2024–25 సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో జీసీసీల వాటా 42 శాతంగా ఉందని, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 41 శాతంగా ఉన్నట్టు వెస్టియన్ తెలిపింది. రానున్న రోజుల్లో జీసీసీల వాటా మరింత పెరుగుతుందని వెస్టియన్ సీఈవో శ్రీనివాసరావు అంచనా వేశారు. ఐటీ–ఐటీఈఎస్, బీఎఫ్‌ఎస్‌ఐ, హెల్త్‌కేర్ అండ్ లైఫ్ సైన్సెస్, ఇంజనీరింగ్, తయారీ, కన్సల్టింగ్ సేవల రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీలు విస్తరణపై
దృష్టి సారించినట్టు చెప్పారు. నిపుణుల లభ్యతకు తోడు బలమైన ఎకోసిస్టమ్ అండతో భారత్ ఆశావహంగా మారినట్టు పేర్కొన్నారు.
బెంగళూరులో అధిక వృద్ధి..
అత్యధికంగా బెంగళూరులో గత ఆర్థిక సంవత్సరంలో 12.43 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీని జీసీసీలు లీజింగ్‌కు తీసుకున్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో బెంగళూరులో జీసీసీల లీజింగ్ పరిమాణం 8.34 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. ముంబైలో జీసీసీల ఆఫీస్ స్పేస్ లీజింగ్ 3.68 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో లీజింగ్ 1.36 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీతో పోల్చి చూస్తే 170 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. డీఎల్‌ఎఫ్, ఎంబసీ గ్రూప్, సత్వ గ్రూప్, ప్రెస్టీజ్ గ్రూప్, ఆర్‌ఎంజెడ్ గ్రూప్, టాటా రియల్టీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తదితర సంస్థలు ఆఫీస్ స్పేస్ మార్కెట్లో ప్రముఖంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్, బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ట్రస్ట్, ఎంబసీ ఆఫీస్ పార్క్స్ రీట్ కూడా కార్యాలయ వసతుల లీజింగ్ మార్కెట్లోనే పనిచేస్తున్నాయి.