రియల్టీలోకి తగ్గిన విదేశీ పెట్టుబడులు | Sakshi
Sakshi News home page

రియల్టీలోకి తగ్గిన విదేశీ పెట్టుబడులు

Published Mon, Jan 29 2024 6:28 AM

Fund inflow in real estate from foreign investors dips 30percent - Sakshi

న్యూఢిల్లీ: దేశీయ రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి గతేడాది (2023లో) 2.73 బిలియన్‌ డాలర్ల మేర విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు వచ్చాయి. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే 30 శాతం తగ్గాయి. 2022లో  3.96 బిలియన్‌ డాలర్లు వచ్చాయి. మరోవైపు, దేశీ సంస్థల పెట్టుబడులు రెట్టింపై 687 మిలియన్‌ డాలర్ల నుంచి 1.51 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. మొత్తం మీద 2023లో రియల్‌ ఎస్టేట్‌లోకి సంస్థాగత పెట్టుబడులు 12 శాతం క్షీణించి 4.9 బిలియన్‌ డాలర్ల నుంచి 4.3 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ వెస్టియన్‌ విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

విదేశీ ఫండ్స్‌ ఆచితూచి వ్యవహరించడం వల్ల పెట్టుబడులు మందగించినట్లు వెస్టియన్‌ సీఈవో శ్రీనివాస రావు తెలిపారు. ‘రియల్‌ ఎస్టేట్‌ రంగంలో డిమాండ్‌పై అనిశ్చితి నెలకొన్నప్పటికీ 2023లో పెట్టుబడులు భారీగానే వచ్చాయి. భారత వృద్ధి గాథపై దేశీ ఇన్వెస్టర్లలో నెలకొన్న విశ్వాసం, వారి ఆశావహ దృక్పథం మార్కెట్‌ను నిలబెట్టింది‘ అని ఆయన పేర్కొన్నారు. 2023లో పెట్టుబడులు అయిదేళ్ల కనిష్టానికి తగ్గినా.. దేశీ ఎకానమీ మెరుగైన పనితీరు, ఇన్‌ఫ్రా రంగంలో ప్రతిపాదిత ప్రాజెక్టుల ఊతంతో 2024లో ఇన్వెస్ట్‌మెంట్లు మరింత పుంజుకోగలవని శ్రీనివాస రావు అభిప్రాయపడ్డారు.

కొత్త పెట్టుబడి సాధనాల రాకతో భారతీయ రియల్‌ ఎస్టేట్‌ రంగం వేగంగా విస్తరిస్తోందని, దీంతో నిధుల అవసరం కూడా పెరుగుతోందని చెప్పారు. ఇలా పెట్టుబడులకు డిమాండ్‌ అధికంగా ఉండటం వల్ల ఇన్వెస్ట్‌మెంట్లపై కూడా అధిక రాబడులు రావొచ్చని, అదే ఆలోచనతో ఇన్వెస్టర్లు రియల్టీలో మరిన్ని పెట్టుబడులు పెట్టొచ్చని శ్రీనివాస రావు వివరించారు. 2019లో దేశీ రియల్‌ ఎస్టేట్‌లోకి సంస్థాగత పెట్టుబడులు 6.5 బిలియన్‌ డాలర్ల మేర వచ్చాయి. 2020లో 5.9 బిలియన్‌ డాలర్లు, 2021లో 4.8 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement