ఆరోగ్య బీమా.. మీ భవిష్యత్తుకు ధీమా: ఇవి తెలుసుకోకుండా కంపెనీ ఎంచుకోకండి!

Five Factors for Choosing a Health Insurance Company - Sakshi

కరోనా మహమ్మారి తర్వాత ఆరోగ్య బీమా అవసరంపై అవగాహన పెరిగింది. అయితే దేశీయంగా 24 జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు, 5 ప్యూర్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు ఉన్నందున సరైన బీమా సంస్థను ఎంచుకోవడం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య బీమా సంస్థను ఎంచుకునే ముందు పరిశీలించాల్సిన అయిదు ముఖ్య అంశాల గురించి వివరించేదే ఈ కథనం.

► క్లెయిమ్‌ సెటిల్మెంట్‌ నిష్పత్తి: బీమా సంస్థకు ఎన్ని క్లెయిమ్స్‌ వస్తే అది ఎన్నింటిని సెటిల్‌ చేసిందనే విషయాన్ని ఇది తెలియజేస్తుంది. 93–94 శాతం లేదా అంతకంటే ఎక్కువ నిష్పత్తి ఉన్న సంస్థలను మాత్రమే ఎంచుకోవడం మంచిది.  

► వినియోగదారుల ఫిర్యాదులు: ఇది వరకే ఉన్న వినియోగదారులు సదరు బీమా సంస్థపై ఏమైనా ఫిర్యాదులు చేశారా అనేది కూడా చూసుకోవాలి. క్లెయిమ్‌ ఫిర్యాదులు, పాలసీ ఫిర్యాదుల వివరాలు ‘Nఔ–45 (గ్రీవెన్స్‌ డిస్పోజల్‌) ఫారం’లో ఉంటాయి. దీన్ని ప్రతి బీమా కంపెనీ అందుబాటులో ఉంచాలి. ఫిర్యాదులు తక్కువగా ఉండటం మెరుగైన కస్టమర్‌ అనుభవాన్ని సూచిస్తుంది.

► ఆన్‌లైన్‌ కస్టమర్‌ రేటింగ్స్‌: గూగుల్, ఫేస్‌బుక్‌లో లభించే కస్టమర్‌ రేటింగ్స్‌ వల్ల కూడా కస్టమర్లు ఎంత సంతృప్తిగా ఉన్నారనేది తెలుసుకోవచ్చు. రేటింగ్‌ ఎక్కువగా ఉన్న బీమా సంస్థలు మెరుగై న సర్వీసులు అందిస్తున్నాయని భావించవచ్చు.

► ప్రీమియం చార్జీలు, ప్రయోజనాలు: మనం తీసుకునే పాలసీకి ఎంత ప్రీమియం వసూలు చేస్తున్నారనేది అందరూ ఎక్కువగా గమనించే అంశం. అయితే, ప్రీమియం తక్కువగా ఉందనే ప్రాతిపదికన పాలసీలను ఎంచుకోవడం అన్ని వేళలా సరి కాకపోవచ్చు. బీమా సంస్థ అందించే ఆరు కీలక ప్రయోజనాలతో ప్రీమియంను పోల్చి చూసుకోండి. గది అద్దెపై పరిమితి లేకపోవడం, సమ్‌ ఇన్సూర్డ్‌ బ్యాకప్‌ లేదా పునరుద్ధరణ బెనిఫిట్‌ (ఎటువంటి మినహాయింపుల నిబంధనలు లేకుండా), ఆఫర్‌ చేసే క్యుములేటివ్‌ బోనస్‌ పర్సంటేజీ (కనిష్టంగా 50 శాతం, అంతకంటే ఎక్కువ), కో–పేమెంట్‌ లేకుండా, కన్జూమబుల్స్‌కు కూడా మంచి కవరేజీ, ప్రీ–పోస్ట్‌ హాస్పిటలైజేషన్‌ ప్రయోజనం (కనీసం 60/90 రోజుల వరకు), అలాగే అవయవదాత ఖర్చులు వీటిలో ఉంటాయి.  
► డిస్కౌంట్లు: మీరు ఎంచుకున్న పాలసీ ఖరీదైనది అయితే ప్రీమియంను తగ్గించుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. నేడు మార్కెట్లో ఉన్న చాలా బీమా సంస్థలు 5–20 శాతం తగ్గింపు అందిస్తున్నాయి. అధిక వెయిటింగ్‌ పీరియడ్‌ కోసం తగ్గింపు, డిడక్టబుల్స్, ధూమపానం చేయని వారికి డిస్కౌంట్, ఎక్కువ క్రెడిట్‌ స్కోరు ఉన్న వారికి (750 అంతకంటే ఎక్కువ), పాత కస్టమర్‌గా ఉండటం, సిటీ డిస్కౌంట్లు (మీరు జోన్‌–2లో నివసిస్తుంటే) వంటి అంశాలు వీటిలో ఉంటాయి.

► ఆరోగ్య బీమా సంస్థను ఎంచుకునేటప్పుడు ఇలాంటి విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. అలాగే తుది నిర్ణయం తీసుకునే ముందు పాలసీ నిబంధనలు, షరతులను తప్పకుండా చదవాలని గుర్తుంచుకోండి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top