ఆర్థిక రంగంపై నిరంతరం నిఘా పెట్టండి

Finance Minister Nirmala Sitharaman Chairs 25th Meeting Of FSDC - Sakshi

సమ్మిళిత వృద్ధికి కృషి చేయండి 

నియంత్రణ సంస్థలకు కేంద్ర మంత్రి నిర్మల సూచన 

ముంబై: దేశీ, అంతర్జాతీయ పరిణామాలతో పలు సవాళ్లు తలెత్తుతున్న నేపథ్యంలో ఆర్థిక రంగంపై నిరంతరం నిఘా పెట్టాలని నియంత్రణ సంస్థలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సూచించారు. అలాగే సమ్మిళిత వృద్ధి సాధనకు కృషి చేయాలని పేర్కొన్నారు. మంగళవారం 25వ ఆర్థిక స్థిరత్వ, అభివృద్ధి మండలి (ఎఫ్‌ఎస్‌డీసీ) సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు.

ఈ భేటీలో ఆర్థిక రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధ వాతావరణం కారణంగా నెలకొన్న పరిస్థితులను సమీక్షించారు. ‘ఎఫ్‌ఎస్‌డీసీ లక్ష్యాలు, దేశ విదేశ పరిణామాలతో ఎదురవుతున్న ప్రధాన సవాళ్లపై కౌన్సిల్‌ చర్చించింది. అలాగే ఎకానమీలో పరిస్థితులు, కీలక ఆర్థిక సంస్థల పనితీరుపై అన్ని నియంత్రణ సంస్థలు, ప్రభుత్వం నిరంతరం ఒక కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది‘ అని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్, సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సే్చంజ్‌ బోర్డ్‌ (సెబీ) చైర్మన్‌ అజయ్‌ త్యాగి, ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కిషన్‌రావ్‌ కరాద్, ఆర్థిక విభాగం కార్యదర్శి టీవీ సోమనాథన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్‌ సేఠ్, రెవెన్యూ కార్యదర్శి తరుణ్‌ బజాజ్, ఆర్థిక సర్వీసుల విభాగం కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

2022–23 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఈ అత్యున్నత స్థాయి మండలి సమావేశం కావడం ఇదే ప్రథమం. చివరిసారిగా గతేడాది సెప్టెంబర్‌ 3న ఇది భేటీ అయ్యింది.  ఆర్థిక స్థిరత్వ నిర్వహణకు, నియంత్రణ సంస్థల మధ్య సమన్వయాన్ని పెంచేందుకు, ఆర్థిక రంగ అభివృద్ధికి దోహదపడే చర్యలు తీసుకునేందుకు ఫైనాన్షియల్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థలతో సంప్రదింపుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌ఎస్‌డీసీని ఏర్పాటు చేసింది.

ఎన్‌ఎస్‌ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నాం.. 
నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్చంజీలో (ఎన్‌ఎస్‌ఈ) చోటు చేసుకున్న పాలనాపరమైన అవకతవకలను ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌.. విలేకరులకు తెలిపారు. దీని గురించి పూర్తిగా సమాచారం తనకు వచ్చే వరకూ, ఈ విషయంలో విధించిన జరిమానాలు, తీసుకున్న దిద్దుబాటు చర్యలు మొదలైనవి సరైన స్థాయిలోనే ఉన్నాయా అన్న అంశంపై తాను స్పందించలేనన్నారు.

ఎల్‌ఐసీ ఇష్యూపై మార్కెట్లో ఆసక్తి.. 
ప్రతిపాదిత లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) పబ్లిక్‌ ఇష్యూపై మార్కెట్‌ వర్గాల్లో భారీగా ఆసక్తి నెలకొందని మంత్రి చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఐపీవో పూర్తి కాగలదని ఆమె సూత్రప్రాయంగా తెలిపారు. మార్చిలోనే లిస్ట్‌ చేయాలని భావిస్తున్నప్పటికీ.. భౌగోళిక, రాజకీయ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామంటూ ఎల్‌ఐసీ చైర్మన్‌ ఎంఆర్‌ కుమార్‌ చెప్పిన నేపథ్యంలో సీతారామన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top