ఫేస్‌బుక్‌ కళ్లద్దాలు: ఎదుటివాళ్లను ఎలా పడితే అలా తీయొచ్చా?

Is Facebook Smart Glasses Privacy Infringement Device - Sakshi

Facebook Sunglass: ఫేస్‌బుక్‌ కొత్తగా తీసుకొచ్చిన స్మార్ట్‌ కళ్లజోడు విషయంలో ఊహించిందే జరుగుతోంది. కళ్లజోడుపై ఉన్న చిన్న కెమెరా గురించి పలువురు అనుమానాలు లేవనెత్తుతున్నారు.  అవతలి వాళ్లను అనుమతులు లేకుండా ఫొటోలు, వీడియోలు తీసే విషయంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. 

ప్రముఖ కళ్లజోడు కంపెనీ రే-బాన్‌తో కలిసి ఫేస్‌బుక్‌ ‘రే బాన్‌ స్టోరీస్‌’ పేరిట స్మార్ట్‌ కళ్లజోడును మార్కెట్‌లోకి రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ కళ్లజోడుకు పైభాగంలో చిన్న కెమెరా ఉంటుంది.  దీని సాయంతో ఫొటోలు, షార్ట్‌ వీడియోలు తీయొచ్చని ఫేస్‌బుక్‌ ప్రకటించుకుంది కూడా. అయితే ఎదుటివారి అనుమతులు లేకుండా ఫొటోలు, వీడియోలు తీసే అవకాశం ఉన్నందున  యూరోపియన్‌ యూనియన్‌ ప్రైవసీ రెగ్యులేటర్‌ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
 

ఈ క్రమంలో ఐర్లాండ్‌ డాటా ప్రొటెక్షన్‌ కమిషన్‌(డీపీసీ) ఎదుట హాజరైన ఫేస్‌బుక్‌ ప్రతినిధులు.. కెమెరా పైభాగంలో ఉండే చిన్న ఎల్‌ఈడీ ఇండికేటర్‌ లైట్‌ గురించి వివరించారు. ఒకవేళ  ఎదుటివాళ్లు ఫొటోగానీ, వీడియోగానీ తీస్తుంటే..  ఆ లైట్‌ ఆధారంగా గుర్తించొచ్చని ఫేస్‌బుక్‌ వివరణ ఇచ్చుకుంది. కానీ, డీపీసీ ఈ వివరణతో సంతృప్తి చెందనట్లు తెలుస్తోంది. కెమెరా చిన్నదిగా ఉండడం, పైగా ఆ లైట్‌ వెలుతురూ అంతగా లేకపోవడంపై డీపీసీ అభ్యంతరాలు లేవనెత్తినట్లు సమాచారం.
 

ట్రబుల్‌ మేకర్‌
ఇటలీ ప్రైవసీ విభాగం ‘ది గరాంటే’.. ఇదివరకే ఈ స్మార్ట్‌కళ్లజోడు విషయంలో ప్రజల భద్రత గురించి ప్రశ్నలు లేవనెత్తింది.  అయితే ఫేస్‌బుక్‌ రీజియన్‌ బేస్‌ ఐర్లాండ్‌లో ఉండడం వల్ల..  ఐర్లాండ్‌ డాటా ప్రొటెక్షన్‌ కమిషన్‌ విచారణ నడుస్తోంది. ఇక డీపీసీ తలనొప్పి ఫేస్‌బుక్‌కు కొత్తేం కాదు. ఫేస్‌బుక్‌ చాలాకాలం నుంచి తేవాలనుకుంటున్న ఫేషియల్‌ ట్యాగింగ్‌ ఫీచర్‌, డీపీసీ అభ్యంతరాల వల్లే వాయిదా పడుతోంది. అంతేకాదు  వాట్సాప్‌ డాటాను మాతృక సంస్థ ఫేస్‌బుక్‌ పంచుకుంటోందన్న ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది కూడా. ఇక  ఫేస్‌బుక్‌, ఫేస్‌బుక్‌ బిజినెస్‌ వ్యవహరాలకు సంబంధించిన ఫిర్యాదులెన్నో డీపీసీ ముందు పెండింగ్‌లో ఉండగా.. ఈ మధ్యే  ‘ట్రాన్సపరెన్సీ ఫెయిల్యూర్‌’ ఫిర్యాదు ఆధారంగా  267 డాలర్ల పెనాల్టీ సైతం విధించింది.
 

వచ్చే ఏడాది మరొకటి
అయితే ఈ ఫిర్యాదులపై ఫేస్‌బుక్‌ సానుకూలంగా స్పందించింది.  అప్రమత్తత కారణంగా ఇలాంటి అనుమానాలు లేవనెత్తడం సహజమేనని,  ఆ అనుమానాల్ని నివృత్తి చేస్తూ వివరణలు ఇస్తామని ఫేస్‌బుక్‌ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.  ఇక ఫేస్‌బుక్‌ ప్రస్తుతం విడుదల చేసిన కళ్లద్దాలు అగుమెంటెడ్‌ రియాలిటీ టెక్నాలజీ కాకుండానే మార్కెట్‌లోకి రిలీజ్‌ అయ్యింది.  వచ్చే ఏడాదిలో ప్రమఖ కళ్లజోడు కంపెనీ  లగ్జోట్టికా సహకారంతో ఏఆర్‌ సంబంధిత కళ్లద్దాల్ని తేనున్నట్లు ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఇదివరకే ప్రటించాడు కూడా.  ఇక ప్రస్తుతం తెచ్చిన రే బాన్‌ స్టోరీస్‌ కళ్లజోడులో 5ఎంపీ కెమెరా ఉంది.  299 డాలర్లు(సుమారు 22 వేల రూపాయలు) ప్రారంభ ధర కాగా..  యూకేతో పాటు ఈయూ పరిధిలోని ఐర్లాండ్‌, ఇటలీలో అమ్ముతున్నారు.

చదవండి: ఫోన్‌ మాట్లాడేందుకు కళ్లజోడు.. ఈ కంపెనీనే! 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top