రత్నాలు, ఆభరణాల ఎగుమతులు డౌన్‌ | Sakshi
Sakshi News home page

రత్నాలు, ఆభరణాల ఎగుమతులు డౌన్‌

Published Fri, Jan 19 2024 7:38 AM

Exports of Gems And Jewellery Down - Sakshi

ముంబై: రత్నాలు, ఆభరణాల ఎగుమతులు డిసెంబర్‌లో వార్షికంగా 8.14 శాతం తగ్గి రూ. 18,281.49 కోట్లకు ( 2,195.23 మిలియన్‌ డాలర్లు) చేరుకున్నాయని జెమ్‌ జ్యువెలరీ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (జీజేఈపీసీ) పేర్కొంది. గత ఏడాది ఇదే నెల్లో ఈ ఎగుమతుల విలువ రూ.19,901.55 కోట్లని (2,413.46 మిలియన్‌ డాలర్లు) వివరించింది.

కీలక ఎగుమతి మార్కెట్లలో మందగమన పరిస్థితులు,  భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు, భారత్, అమెరికాసహా 60 దేశాల్లో ఎన్నికల వంటి అంశాలు ఈ విభాగం ఎగుమతుల రంగంపై ప్రభావం చూపుతున్నట్లు మండలి చైర్మన్‌ విపుల్‌ షా చెప్పారు. ఇక కట్‌ అండ్‌ డైమండ్‌ మొత్తం ఎగుమతులు డిసెంబరులో 31.42 శాతం తగ్గి రూ. 7,182.53 కోట్లకు (862.48 మిలియన్‌ డాలర్లు) చేరాయి.

గత సంవత్సరం ఇదే నెల్లో ఈ విలువ  రూ. 10,472.93 కోట్లు ( 1,270.36 మిలియన్‌ డాలర్లు). అయితే డిసెంబర్‌లో బంగారు ఆభరణాల ఎగుమతులు 47.32 శాతం పెరిగి రూ.7,508.05 కోట్లకు ( 901.52 మిలియన్‌ డాలర్లు) చేరాయి.  గత ఏడాది ఇదే నెల్లో ఈ విలువ  రూ. 5,096.25 కోట్లు ( 618.27 మిలియన్‌ డాలర్లు).

Advertisement
Advertisement