EPF 8.25% వడ్డీ ఎప్పుడు జమ అవుతుంది.. ఎలా చెక్‌ చేసుకోవాలి? | epf 8 25 interest credit date how to check balance | Sakshi
Sakshi News home page

EPF 8.25% వడ్డీ ఎప్పుడు జమ అవుతుంది.. ఎలా చెక్‌ చేసుకోవాలి?

Jun 6 2026 5:29 PM | Updated on Jun 6 2026 6:27 PM

epf 8 25 interest credit date how to check balance

దేశంలోని కోట్లాది ఉద్యోగులకు ఊరటనిస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.25 శాతంగా కొనసాగించింది. గత మార్చిలో జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా, ఇది వరుసగా మూడో ఏడాది కూడా అదే స్థాయిలో కొనసాగుతున్న వడ్డీ రేటుగా నిలిచింది. అయితే ఇది ఎప్పుడు జమవుతుందని ఉద్యోగులు ఆతృతగా ఎదురుగా చూస్తున్నారు.

వడ్డీ జమ ఎప్పుడు?

వడ్డీ రేటును సీబీటీ సిఫారసు చేసినప్పటికీ, అది ఖాతాల్లో జమ కావాలంటే కేంద్ర ప్రభుత్వం అధికారిక ఆమోదం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఈపీఎఫ్ఓ సభ్యుల ఖాతాల్లో వడ్డీని జమ చేస్తుంది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ ఖచ్చితమైన తేదీని ప్రకటించలేదు. గత అనుభవాలను బట్టి చూస్తే జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో వడ్డీ జమయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఆలస్యమైనా నష్టం ఉండదు

వడ్డీ ఖాతాలో ఆలస్యంగా కనిపిస్తే తమకు నష్టం జరుగుతుందేమోనని చాలామంది సభ్యులు ఆందోళన చెందుతుంటారు. అయితే ఈపీఎఫ్‌ పథకం నిబంధనల ప్రకారం సభ్యుల అర్హత కలిగిన నిల్వలపై వడ్డీని నిరంతరం లెక్కిస్తారు. ఖాతాలో ఎంట్రీ ఆలస్యంగా నమోదైనా, చెల్లించాల్సిన పూర్తి వడ్డీ మొత్తాన్ని సభ్యులకు జమ చేస్తారు. అందువల్ల పరిపాలనా ఆలస్యం వల్ల ఖాతాదారులు ఎలాంటి ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోరు.

పాస్‌బుక్‌లో ఈ ఎంట్రీ కనిపిస్తే వడ్డీ పడ్డట్టే..

వడ్డీ జమ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈపీఎఫ్ పాస్‌బుక్‌లో “Int. Updated up to 31/03/2026” అనే ఎంట్రీ కనిపిస్తుంది. ఆ తర్వాత సభ్యులు తమ తాజా బ్యాలెన్స్‌ను పరిశీలించవచ్చు.

బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకునే మార్గాలు

ఈపీఎఫ్ సభ్యులు తమ ఖాతాలో వడ్డీ జమైందో లేదో కింది మార్గాల ద్వారా తెలుసుకోవచ్చు.

🔸 ఉమంగ్ (UMANG) యాప్
🔸 ఈపీఎఫ్ఓ సభ్యుల ఈ-సేవా పోర్టల్
🔸 యూఏఎన్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్ నుంచి 9966044425కు మిస్డ్ కాల్
🔸 7738299899కు UAN EPFOHO ENG (లేదా భాష కోడ్‌తో) ఎస్‌ఎంఎస్ పంపడం

అయితే ఈ సేవలను వినియోగించాలంటే యూఏఎన్ యాక్టివ్‌గా ఉండటంతో పాటు ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా వివరాలు లింక్ అయి ఉండాలి.

స్థిరమైన రాబడితో ఉద్యోగులకు భరోసా

ప్రస్తుతం బ్యాంకు డిపాజిట్లు, బాండ్ ఈల్డ్‌లు ఒత్తిడిలో ఉన్న నేపథ్యంలో 8.25 శాతం ఈపీఎఫ్ వడ్డీ రేటు ఉద్యోగుల పదవీ విరమణ పొదుపులకు ఆకర్షణీయమైన రాబడిని అందిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఆమోదం ఇచ్చిన వెంటనే వడ్డీ జమ ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement