
మెటా వంటి కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్న టాలెంట్ వార్‌పై ఎలాన్ మస్క్ మౌనం వీడారు. సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ ఏర్పాటు కోసం మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఏఐ టాలెంట్‌వార్‌ను ప్రారంభించారు. దాదాపు చాలా టాప్ టెక్నాలజీ కంపెనీల నుంచి ఉన్నతస్థాయి ఉద్యోగులను మెటాలో నియమించుకుంటున్నారు. అందుకోసం భారీగా వేతన ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, విండ్సర్ఫ్.. వంటి ప్రముఖ కంపెనీల నుంచి ఉద్యోగులకు ఆఫర్ లెటర్లు ఇస్తున్నారు. దీనిపై ఎలాన్ మస్క్ తాజాగా వ్యాఖ్యలు చేశారు.
ఎక్స్ఏఐలో చేరిన మెటా ఇంజినీర్లను ఉద్దేశించి ఎలాన్ మస్క్ మాట్లాడుతూ..‘కంపెనీ ఏఐ స్టార్టప్ ఎక్స్ఏఐలో చాలా మంది మెటా ఇంజినీర్లు చేరారు. అయితే మెటా మాదిరిగా కాకుండా, ఎక్స్‌ఏఐ వారిని అనైతికంగా కంపెనీలో చేరడానికి భారీ వేతనాలు ఇవ్వడం లేదు. మెరుగైన నైపుణ్యం కలిగిన చాలా మంది మెటా ఇంజినీర్లు ఎక్స్ఏఐలో చేరుతున్నారు. మెటా కంటే ఎక్స్ఏఐకి చాలా ఎక్కువ మార్కెట్ క్యాపిటల్ వృద్ధి సామర్థ్యం ఉంది. హైపర్ మెరిట్ ఆధారంగా నియమకాలు చేపడుతున్నాం. భారీ ప్యాకేజీల ఆశ చూపడం లేదు’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘అల్ట్రా హార్డ్ కోర్ ఇంజినీర్లకు ఎక్స్‌ఏఐ బెటర్ ప్లేస్’ అని మరో పోస్ట్‌లో రాసుకొచ్చారు.
ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటలిజెన్స్(ఏజీఐ)ను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్(ఎంఎస్ఎల్) అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ విభాగంలో పనిచేసే మెటా ఏఐ మోడల్, ఉత్పత్తి బృందాలు ఫండమెంటల్ ఏఐ రీసెర్చ్(ఫెయిర్)ను అభివృద్ధి చేస్తాయని చెప్పారు. ఎంఎస్ఎల్ కింద కొత్త ల్యాబ్ తదుపరి తరం లార్జ్ ల్యాంగ్వేజ్ మోడళ్ల (ఎల్ఎల్ఎం) నిర్మాణంపై దృష్టి పెడుతుందని తెలిపారు.
ఇదీ చదవండి: ట్రంప్ టారిఫ్ ఆందోళనలు.. త్వరలో మంత్రి భేటీ
గూగుల్, ఎక్స్, మెటా, ఓపెన్‌ఏఐ.. వంటి ప్రధాన కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐ మోడళ్లను సృష్టిస్తున్నాయి. ఈ సంస్థల మధ్య పోటీ తీవ్రతరం అవుతుంది. దాంతో తోటివారికంటే ఓ అడుగు ముందుడాలనే భావనతో కంపెనీ ఏఐ నైపుణ్యాలున్నవారికి భారీ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. కృత్రిమ మేధస్సుపై ఆధిపత్యం చెలాయించే రేసులో భాగంగా మెటా కీలక ప్రచారం ప్రారంభించినట్లు ఇటీవల కొన్ని సంస్థలు తెలుపుతున్నాయి. ఈ విభాగంలో అగ్రశ్రేణి ఏఐ ప్రతిభావంతులను ఆకర్షించేందుకు భారీ ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు తెలుస్తుంది. మెరుగైన ఏఐ నైపుణ్యాలున్న ఎక్స్‌పర్ట్‌లకు 100 మిలియన్ డాలర్ల (రూ.860 కోట్లు) ప్యాకేజీ చెల్లించేందుకు కూడా వెనుకాడడం లేదని సమాచారం.