
భారత టెక్స్‌టైల్, అప్పారెల్ ఎగుమతులపై 25 శాతం సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన ప్రకటన నేపథ్యంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ వచ్చే వారం పరిశ్రమ ప్రముఖులతో సమావేశం కానున్నారు. ట్రంప్ నిర్ణయం వల్ల కలిగే పరిణామాలపై చర్చించేందుకు ఈ సమావేశం కీలకంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతదేశపు టెక్స్‌టైల్ ఎగుమతి మార్కెట్‌లో భవిష్యత్తులో రాబోయే మార్పులు, వాటిని ఎలా సమర్థంగా నిర్వహించాలో ఈమేరకు చర్చించనున్నారు.
అమెరికా టారిఫ్ ముప్పు
భారతదేశం మొత్తం వస్త్ర, దుస్తుల ఎగుమతుల్లో యునైటెడ్ స్టేట్స్ సుమారు 25% వాటాను కలిగి ఉంది. యూఎస్ ఈ రంగానికి అతిపెద్ద మార్కెట్‌గా నిలుస్తోంది. అమెరికాకు భారత్ చేసే ఎగుమతులపై 25 శాతం సుంకం ప్రకటించడం దేశీయ టెక్స్ టైల్ పరిశ్రమలో ఆందోళన రేకెత్తిస్తుంది. ఇది ధరల పోటీతత్వాన్ని, డిమాండ్‌ను తీవ్రంగా దెబ్బతీస్తుందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ దశలో పరిశ్రమకు నిర్దిష్ట ప్రభుత్వ మద్దతు ఉండాలని కొన్ని కంపెనీల యాజమాన్యాలు కోరుతున్నాయి. ఈ పరిస్థితుల ప్రభావాన్ని అంచనా వేయడానికి, పరిశ్రమ వర్గాల నుంచి ఫీడ్ బ్యాక్ సేకరించడానికి పరిశ్రమ నాయకులతో జరిగే చర్చలు కొంత ప్రభావితం చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
యూకే-ఇండియా ఎఫ్‌టీఏ ఎఫెక్ట్
ఇటీవల యూకే-ఇండియా ఫ్రీట్రేడ్ అగ్రిమెంట్(ఎఫ్‌టీఏ) కుదుర్చుకున్న నేపథ్యంలో రాబోయే సమావేశం ఎజెండా టారిఫ్ ఆందోళనలకే పరిమితం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎఫ్‌టీఏ ద్వారా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంపై కూడా చర్చలు జరగనున్నాయి. తగ్గిన సుంకాలు, సరళీకృత వాణిజ్య విధానాల ద్వారా భారతీయ వస్త్రాలకు యూకే మార్కెట్‌ను మరింత పెంచాలని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: ఆస్తిపాస్తులు గోప్యంగా ఉంచితే అంతే..
100 బిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యం
ప్రభుత్వ మద్దతు, వ్యూహాత్మక వాణిజ్య ఒప్పందాలతో భారతీయ వస్త్ర, దుస్తుల పరిశ్రమ 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ మైలురాయిని చేరుకోవడానికి కీలక మార్కెట్ల నుంచి అనుకూలమైన విధానాలు అవసరం. అభివృద్ధి చెందుతున్న సరఫరా గొలుసు ధోరణులతో సహా మారుతున్న ప్రపంచ వాణిజ్య డైనమిక్స్‌ను అందిపుచ్చుకోవాలని చూస్తున్నారు.