
యూఎస్‌లో పెట్టుబడులను ఐటీఆర్‌లో తెలపాల్సిందే..
ముందుగానే అవగాహన అవసరం
యాపిల్, అమెజాన్, టెస్లా వంటి టెక్ దిగ్గజాలను కలిగి ఉన్న యూఎస్ స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలని చాలామంది ఇతర దేశాల పెట్టుబడిదారులు యోచిస్తుంటారు. యూఎస్ మార్కెట్ ఆకర్షణీయంగా తోస్తున్నా భారతీయ పెట్టుబడిదారులు అక్కడ ఇన్వెస్ట్ చేసేముందు చాలా విషయాలు తీలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతర్జాతీయ పెట్టుబడి బ్రోకర్ ఖాతా తెరవడం, స్టాక్ ఎంచుకోవడం, అందులో పెట్టుబడి పెట్టడం అంత సులభం కాదని చెబుతున్నారు.
విదేశాల్లో ముఖ్యంగా యు.ఎస్‌లో పెట్టుబడి పెట్టడంతోపాటు భారతీయ ఇన్వెస్టర్లకు అక్కడ అమల్లో ఉన్న సంక్లిష్టమైన చట్టపరమైన ఫ్రేమ్ వర్క్‌లు, పన్ను చిక్కులు, ఖర్చులపై స్పష్టమైన అవగాహన ఉండాలి. అక్కడ పెట్టుబడి పెట్టి భారతీయ విధానాలు పాటించడంలో విఫలమైతే భారీ జరిమానాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి.
లీగల్ ఫ్రేమ్‌వర్క్
ఆర్‌బీఐ 2004లో ప్రవేశపెట్టిన లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద భారతీయులు విదేశాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. ప్రస్తుత పరిమితి మైనర్లతో సహా ప్రతి వ్యక్తికి ఆర్థిక సంవత్సరానికి 2,50,000 డాలర్లుగా ఉంది. ట్రావెల్, ఎడ్యుకేషన్, యూఎస్ ఈక్విటీలతో సహా విదేశీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వంటి వివిధ లావాదేవీలు ఇందులో కవర్ అవుతాయి. ఇన్వెస్టర్ల మొత్తం వార్షిక విదేశీ రెమిటెన్స్ రూ.10 లక్షలు దాటితే మూలం వద్ద వసూలు చేసిన పన్ను (టీసీఎస్) వర్తిస్తుంది.
డివిడెండ్లు
అమెరికా కంపెనీల నుంచి డివిడెండ్లు వస్తే వాటిని భారత్‌లో విదేశీ ఆదాయంగా వర్గీకరిస్తారు. ఆదాయ స్థాయితో సంబంధం లేకుండా అమెరికా 25% పన్నును ముందస్తుగా నిలిపివేస్తుంది. అయితే, భారత్-అమెరికాల పరిధిలో డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ (డీటీఏఏ) అమలులో ఉంది. భారతీయ పన్నులను దాఖలు చేసేటప్పుడు ఈ మినహాయింపు కోసం విదేశీ పన్ను క్రెడిట్‌ను క్లెయిమ్ చేయవచ్చు.
క్యాపిటల్ గెయిన్స్
అమెరికా పన్ను నిబంధనల ప్రకారం ప్రవాస భారతీయులుగా పరిగణించే భారతీయ నివాసితుల మూలధన లాభాలపై అమెరికా పన్ను విధించదు. కానీ భారత్‌లో పన్నులు చెల్లించాల్సిందే. 24 నెలల కంటే ఎక్కువకాలం ఉన్న పెట్టుబడి లాభాలపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్టీసీజీ)గా ఇండెక్సేషన్, సర్‌ఛార్జ్, సెస్‌తో కలిపి 20 శాతం పన్ను విధిస్తారు. 24 నెలల కంటే తక్కవగా ఉన్నవాటిని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎస్టీసీజీ)గా పరిగణించి ఆదాయ శ్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు.
స్టాక్స్ వివరాలు తెలపాల్సిందే..
భారతదేశంలో ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేసేటప్పుడు అన్ని విదేశీ ఆస్తులను షెడ్యూల్ ఎఫ్ఏ (విదేశీ ఆస్తులు) కింద ప్రకటించాలి. చిన్నమొత్తంలోని పెట్టుబడులను సైతం బహిర్గతం చేయాలి. అందులో విఫలమైతే బ్లాక్‌మనీ (అప్రకటిత విదేశీ ఆదాయం, ఆస్తులు), పన్ను విధింపు చట్టం, 2015 కింద తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. ఈ వివరాలు వెల్లడించని వారికి ఏడాదికి రూ.10 లక్షల జరిమానా విధిస్తారు.
రివైజ్డ్ రిటర్న్
ఏదైనా పరిస్థితుల్లో ఐటీఆర్ దాఖలు చేసేపుడు విదేశీ హోల్డింగ్స్‌ను ప్రకటించడంలో విఫలమైతే గడువులోగా రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేయాలి. లేదంటే సెక్షన్ 139(8ఏ) కింద అప్డేటెడ్ రిటర్న్ (ఐటీఆర్‌యూ) ఆప్షన్‌ను ఉపయోగించాలి. ఏదేమైనా మీ ఫైలింగ్లను సమీక్షించడానికి, పూర్తి సమ్మతిని నిర్ధారించడానికి అర్హత కలిగిన పన్ను నిపుణులను సంప్రదిస్తే మేలు.
ఇదీ చదవండి: ఆర్‌బీఐ ఎంపీసీ దారెటు..?
విదేశాల్లో పెట్టుబడులు పెట్టే ముందు..
చట్టపరమైన ఆంక్షలు, విధానలను అర్థం చేసుకోవాలి.
రెండు దేశాల్లో వాటి పన్ను ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి.
ప్రతి హోల్డింగ్, ఆదాయ మార్గాన్ని ఐటీఆర్‌లో వెల్లడించాలి.
అవసరమైనప్పుడు ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకోవాలి.
ఎంతైనా తప్పును ఐటీ అధికారుల ముందు సమర్థించుకోవడం కంటే ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది.