
ఆగస్టు 4-6 మధ్య ఎంపీసీ సమావేశం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తదుపరి సమావేశం ఆగస్టు 4-6 మధ్య జరుగుతున్నందున ఈసారి రెపో రేటుపై నిర్ణయం ఎలా ఉంటుందోననే ఆర్థిక వర్గాల్లో చర్చ సాగుతోంది. గతంలోలాగే రెపో రేటును మరింత తగ్గిస్తారా? లేదా వరుస దూకుడు రేట్లలో కాస్తా విరామం తీసుకుంటారా? అనే సందిగ్ధం నెలకొంది. ఇటీవల జరిగిన సమీక్షల్లో ఇప్పటికే రెపో రేటును 100 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) తగ్గించారు.
ఈసారి కొంతమంది ఆర్థికవేత్తలు రెపో రేటు తగ్గింపు విషయంలో ఎంపీసీ విరామం తీసుకుంటుందని యోచిస్తున్నారు. గతంలో ఇచ్చిన వెసులుబాటు రేట్ల కోత ఫలితాలు ఆర్థిక వ్యవస్థలో ప్రతిబింబించేందుకు కాసింత సమయం అవసరమని వాదిస్తున్నారు. మరికొందరు అంతర్జాతీయ, దేశీయ అనిశ్చితుల నేపథ్యంలో ఆర్‌బీఐ ముందుచూపుగా మరోసారి సడలింపు నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు.
ఆర్థిక అనిశ్చితులు..
జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 2.1 శాతంగా ఉంది. ఇది ఎంపీసీ లక్ష్యంగా ఉన్న 4% కంటే వరుసగా ఐదో నెలలోనూ తక్కువగానే నమోదైంది. ఇది సెంట్రల్ బ్యాంకుకు కాస్త ఊరటనిచ్చే అంశం. అయితే భారత దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తూ అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎగుమతి పోటీతత్వం, రూపాయి స్థిరత్వంపై అనిశ్చితిని సృష్టించింది. భవిష్యత్తులో సుంకాలను తగ్గించే చర్చలు జరిగే అవకాశం కూడా ఉంది. విధాన నిర్ణేతలు ఈ పరిణామాలను పరిశీలించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: ఆ భాషను ఎవరూ అర్థం చేసుకోలేరు: హింటన్ హెచ్చరిక
ఈసారి తీపికబురు ఉండదా?
తాజాగా ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చేసిన వ్యాఖ్యలతో రెపో రేటు తగ్గింపులో కాస్త విరామం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఓ కార్యక్రమంలో మల్హోత్రా మాట్లాడుతూ.. జూన్‌లో ఎంపీసీ రెపో రేటు విధానంలో పాజిటివ్ నుంచి స్టేబుల్ వైఖరి ఉన్నట్లు తెలిపారు. కేర్ రేటింగ్స్‌కు చెందిన ఆర్థికవేత్తలు రజనీ సిన్హా, సర్బర్తో ముఖర్జీ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. ద్రవ్యోల్బణం తగ్గుతుందని ముందే ఊహించి ఆర్‌బీఐ ఇప్పటికే చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. వృద్ధి ఆందోళనలు తీవ్రమైతే తప్పా మరిన్ని కోతలు విధించే అవకాశం లేదని తెలిపారు.