హైదరాబాద్‌లో కొత్త జీసీసీ ఏర్పాటుకు ప్రణాళికలు | Eli Lilly to Establish New Global Capability Centre in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో కొత్త జీసీసీ ఏర్పాటుకు ప్రణాళికలు

Jan 9 2025 2:15 PM | Updated on Jan 9 2025 2:15 PM

Eli Lilly to Establish New Global Capability Centre in Hyderabad

హైదరాబాద్‌ గ్లోబల్ కెపాసిటీ సెంటర్లకు హబ్‌గా మారుతోంది. హెల్త్‌ సెక్టార్‌లో సేవలందిస్తున్న ఎలీ లిల్లీ అండ్ కంపెనీ హైదరాబాద్‌లో కొత్తగా గ్లోబల్ కెపాసిటీ సెంటర్(GCC)ను ఏర్పాటు చేసే ప్రణాళికలను ప్రకటించింది. ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్‌వేర్‌ ప్రొడక్ట్ ఇంజినీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఎలీ లిల్లీ సేవలందిస్తోంది. ఈ సంస్థ ఇప్పటికే 2016లో బెంగళూరులో జీసీసీను ఏర్పాటు చేసింది. త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభించబోయే జీసీసీ ఇండియాలో రెండోది కావడం విశేషం. కొత్త జీసీసీ(Global Capability Center)ను హైదరాబాద్‌కు ఆహ్వానించడం సంతోషంగా ఉందని తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. హెల్త్ కేర్ ఇన్నోవేషన్‌లో హైదరాబాద్‌ ఖ్యాతి పెరుగుతోందని చెప్పారు.

లిల్లీ కెపాసిటీ సెంటర్ ఇండియా (ఎల్‌సీసీఐ)గా పిలవబడే ఈ కొత్త జీసీసీ ద్వారా స్థానికంగా మరింత సాంకేతిక సేవలు అందించడంతోపాటు అంతర్జాతీయంగా కూడా ఈ సెంటర్‌ సేవలు ఎంతో కీలకం కానున్నాయని కంపెనీ తెలిపింది. ఈ సెంటర్‌లో టెక్నాలజీ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులతో సహా సుమారు 1,000 నుంచి 1,500 మంది నిపుణులను నియమించుకోవాలని యోచిస్తున్నట్లు ఎలీ లిల్లీ(Eli Lilly) తెలిపింది. ఈ జీసీసీ 2025లోనే అందుబాటులోకి వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: అపోహలు వీడితేనే మంచి స్కోరు

ఈ సందర్భంగా సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ డిజిటల్ ఆఫీసర్ డియోగో రావ్ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌లో కొత్త కేంద్రాన్ని ప్రారంభించే ప్రణాళికలను ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలను మెరుగ్గా మార్చాలనుకునే సాంకేతిక నిపుణులను ఏకతాటిపైకి తీసుకొస్తాం’ అని చెప్పారు. కొత్త సాంకేతిక పురోగతిని ఉపయోగించుకుంటూ వినూత్న ఆవిష్కరణలతో సంస్థ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి హైదరాబాద్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త ఎల్‌సీసీఐ వల్ల యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement