Starbucks CEO Biography: స్టార్‌బక్స్‌ సీఈవో ఇన్‌స్పైరింగ్‌ జర్నీ.. ఫిదా అవ్వాల్సిందే!

Do you know the Starbucks CEO Laxman Narasimhan inspiring Journey - Sakshi

ప్రపంచ కాఫీ తయారీ దిగ్గజం స్టార్‌బక్స్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎంపికైన లక్ష్మణ్ నరసింహన్ చాలా చిన్నస్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి. అమ్మే స్ఫూర్తి. రాక్-కర్ణాటక మ్యూజిక్‌ వరకూ అన్నీ తెలుసు. చాలా చురుకైన ప్రతిభావంతుడు. ఎపుడూ సరదాగా, జోక్‌లేస్తూ ఉండటం అలవాటు. చదవడం, ముఖ్యంగా బిజినెస్‌ బుక్స్‌ చదవడం అంటే చాలా ఇష్టం. చిన్నపుడు ఫుట్‌బాల్‌ గేమ్‌లో గోల్‌ కీపర్‌గా ఉండటమే కాదు, ఎదిగిన తరువాత వ్యావార రంగంలో ఉన్నత పదవులకు వన్నె తెచ్చిన రాక్‌స్టార్‌. ముఖ్యంగా  "మనం ఎక్కడి నుండి వచ్చామో అసలు మర్చిపోవద్దు" అనే జీవిత సత్యాన్ని ఎరిగిన  వారు నరసింహన్‌.

స్టార్‌బక్స్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా లక్ష్మణ్ నరసింహన్‌ ఎంపికతో గ్లోబల్ బ్రాండ్ బిజినెస్‌ లీడర్స్‌గా సత్తా చాటుతున్న భారతీయ సంతతికి చెందిన సీఈవో జాబితా పెరుగుతోంది. స్టార్‌బక్స్ సీఈవోగా లక్ష్మణ్ నరసింహన్ అక్టోబర్ 1, 2022న కంపెనీ బాధ్యతలు స్వీకరిస్తారు. 

స్టార్‌బక్స్ సీఈవోగా, గ్లోబల్‌లీడర్‌గా ఎదిగిన లక్ష్మణ్ నరసింహన్ 30 సంవత్సరాల అనుభవం, వివిధ హోదాల్లో పనిచేసిన ట్రాక్ రికార్డ్ ఆయన్ని మరింత ఉన్నత స్థానంలో నిలబెట్టింది. ఈ క్రమంలో లక్ష్మణ్ విద్య కరియర్‌, అలవాట్లు, హాబీలపై ఒక లుక్కేద్దాం.

లక్ష్మణ్ నరసింహన్ ఏప్రిల్ 15, 1967న పూణేలో జన్మించారు. కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ పూణే, సావిత్రిబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీని పొందారు. తరువాత యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలోని ది లాడర్ ఇన్‌స్టిట్యూట్,  ఇంటర్నేషనల్ స్టడీస్‌లో ఎంఏ, ది వార్టన్ స్కూల్ ఆఫ్ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం  ద్వారా  ఫైనాన్స్‌లో ఎంబీఏ పట్టా పొందారు. 

మెకిన్సేలో ఉద్యోగిగా కరియర్‌ను ప్రారంభించారు. 2012 వరకు 19 సంవత్సరాలు అక్కడ పనిచేశారు. కంపెనీలో తన పని చేస్తున్న సమయంలో, న్యూఢిల్లీ కార్యాలయానికి డైరెక్టర్, లొకేషన్ మేనేజర్‌గా పదోన్నతి పొందారు. 2012లో నరసింహన్ పెప్సికో గ్లోబల్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా మరో మెట్టుఎక్కారు. కంపెనీ దీర్ఘకాలిక వ్యూహం, డిజిటల్ సామర్థ్యాలకు నాయకత్వం వహించి, కంపెనీని లాభాల బాటపట్టించారు. అనంతరం లాటిన్ అమెరికా, యూరప్, సబ్-సహారా ఆఫ్రికా కార్యకలాపాలకు సీఈవోగా కూడా పనిచేశారు.

నరసింహన్ బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్‌కు ట్రస్టీ కూడా, కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ సభ్యుడు, యూ​ఏ ప్రైమ్ మినిస్టర్స్ బిల్డ్ బ్యాక్ బెటర్ కౌన్సిల్ సభ్యుడిగానూ, వెరిజోన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో సభ్యుడుగాను పనిచేశారు. సెప్టెంబరు 2019లో  సీఈవోగా రెకిట్‌లో చేరారు. లైసోల్, డ్యూరెక్స్ కండోమ్‌లు, ఎన్‌ఫామిల్ బేబీ ఫార్ములా, మ్యూసినెక్స్ కోల్డ్ సిరప్‌లఅమ్మకాల్లో రికార్డు సృష్టించారు. కంపెనీ కీలక ఎగ్జిక్యూటివ్‌గా ప్రధాన వ్యూహాత్మక పరివర్తన, స్థిరమైన వృద్ధికితో కంపెనీని లాభాల బాటపట్టించారు.

అమ్మే  స్ఫూర్తి, రోజుకు పూటే భోజనం
ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ గ్లోబల్ మీటింగ్ 'ఫైర్‌సైడ్ చాట్'లో తన జీవిత విశేషాలను పంచుకున్నారు లక్ష్మణ్ నరసింహన్. పూణేలో ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసిన తల్లి తనకు ఎంతగానో స్ఫూర్తినిచ్చిందని చెప్పారు. అలాగే వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదువు, వీసా ఇతర ఖర్చుల కోసం ఇంట్లోని వస్తువులను అమ్మి మరీ డబ్బు కూడగట్టుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అంతేకాదు జర్మనీలో సమ్మర్‌ స్కూల్‌లో విద్య నభ్యసించేటపుడు చేతిలో డబ్బుల్లేక రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేసేవాడట. అందుకే ఏకంగా 10 కిలోల బరువు తగ్గానని, ఇదే తాను జీవితంలో మరింత పట్టుదలగా ఎదడగానికి దోహదం చేసిందంటూ తన అనుభవాలను గుర్తు చేసుకుంటారు నరసింహన్‌. 

అంతేకాదు లాటిన్ అమెరికాలో ఒక కంపెనీ నడుపుతున్నప్పుడు తాను వారాంతంలో స్పానిష్ నేర్చుకున్నారట. నిరంతరం మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలని తన ఉద్యోగులకు సలహా ఇచ్చేవారట. ముఖ్యంగా  "మనం ఎక్కడి నుండి వచ్చామో అసలు మర్చిపోవద్దు" అని కూడా సూచించారట.

స్నేహితుల సంబరం
నరసింహన్‌ క్లాస్‌మేట్ పారిశ్రామికవేత్త నితిన్ జోషి ప్రకారం తన స్నేహితులందర్నీ ఇప్పటికీ చాలా ప్రేయగా ఆప్యాయంగా పలకరించే బెస్ట్‌ ఫ్రెండ్‌. అన్నట్టు వీరికి కూడా పూర్వ విద్యార్థులతో ఒక వాట్సాప్‌ గ్రూపు కూడా ఉందట. ఎంత బిజీ షెడ్యూల్‌ ఉన్నా 1982 లయోలా హై స్కూల్ గ్రూపులో తన ఫోటోలు,  ఎపుడూ అప్‌డేట్‌లను పోస్ట్ చేస్తూ ఉంటారట. అయితే ఎప్పుడూ గ్రూప్‌లో యాక్టివ్‌గా ఉండే ఆయన సడన్‌గా  ఈ మధ్య బిజీ అయిపోయారట. కట్‌ చేస్తే స్టార్‌బక్స్‌గా  సీఈవోగా ఎంపికైన వార్త తెలిసందంటూ జోషి చాలా సంతోషం వ్యక్తం చేశారు. కష్టాలను అధిగమించి, ప్రపంచం నలు మూలలా కష్టపడి పనిచేసి ఈ రోజు గ్లోబల్‌లీడర్‌గా ఎదిగాడని ఆయన ప్రశసించారు.

తండ్రి మార్గదర్శకత్వంలో లక్ష్మణ్ ఫుట్‌బాల్‌ ఆడేవారనీ, ముఖ్యంగా స్కూలు స్థాయిలో జట్టు గోల్ కీపర్‌గా ఉండేవారని విన్సెంట్స్  బాయ్స్ అసోసియేషన్, వ్యాపారవేత్త ముర్తుజా పూనావాలా చెప్పారు. నరసింహన్‌ తమ అకాడమీకే గౌరవాన్ని, గుర్తింపును తెచ్చారని.. ఇందుకు తాము గర్వపడుతున్నామని CoEP యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ సీఈఓ ముకుల్ సుతాన్  తెలిపారు. నరసింహన్‌ బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ సహచరుడని కూడా ఆయన గుర్తుచేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top