పాకిస్థాన్‌ మొత్తం అప్పు ఎంతో తెలుసా..? | do you know Pakistan total debt | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్‌ మొత్తం అప్పు ఎంతో తెలుసా..?

May 4 2025 11:24 AM | Updated on May 4 2025 4:31 PM

do you know Pakistan total debt

ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోన్న దేశంగా పాకిస్థాన్‌కు ప్రపంచంలో బహు గొప్ప పేరే ఉంది. బరాక్‌ ఒబామా పాలనలో యూఎస్‌ ఆర్మీ 2011లో అల్‌-ఖైదా నాయకుడు బిన్‌లాడెన్‌ను పాకిస్థాన్‌లోని అబత్తాబాద్‌లో చంపేశారు. మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌ తమకు తెలియకుండానే అక్కడ తలదాచుకున్నాడని అప్పట్లోనే పాక్‌ ప్రపంచ దేశాల చెవిలో పూలు పెట్టేందుకు ప్రయత్నించింది. పాక్‌ ఉగ్రవాదాన్ని పోషిస్తోందనే ముసుగును తొలగించుకునేందుకు ఎనాడూ ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అక్కడి ప్రజలైనా ఆర్థికంగా, సామాజికంగా మెరుగువుతున్నారా అంటే దేశం అప్పులు భారీగా పెరుగుతున్నాయి. ఇదే అదనుగా చైనా అధిక వడ్డీలకు పాక్‌కు అప్పులిచ్చి, తనకు భవిష్యత్తులో అవసరమయ్యే మౌలిక సదుపాయాలను మాత్రం అభివృద్ధి చేస్తోంది. దీన్ని పాక్‌ గ్రహించినా చేసేదేమిలేక మిన్నకుండిపోతుంది. పాక్‌ అప్పుల చిట్టా రూ.లక్షల కోట్లకు పెరిగింది.

పాకిస్థాన్‌ మొత్తం రుణం పాక్‌ రూపాయి(పీకేఆర్‌)ల్లో 70.36 ట్రిలియన్లకు (భారత కరెన్సీలో సుమారు రూ.21.15 లక్షల కోట్లు) చేరింది. ఇందులో దేశీయ, ఇతర దేశాల నుంచి తీసుకొచ్చిన అప్పులు రెండూ ఉన్నాయి. వీటిలో గణనీయమైన భాగం చైనాకు చెందినవే. పాక్‌ మొత్తం అప్పుల్లో సుమారు 22 శాతం చైనా సమకూర్చినవే కావడం గమనార్హం.

  • పాక్‌ విదేశీ రుణం: 130 బిలియన్ డాలర్లు(సుమారు రూ.10.7 లక్షల కోట్లు).

  • స్వల్పకాలిక విదేశీ చెల్లింపులు: వచ్చే ఏడాదిలో 30.6 బిలియన్ డాలర్లు(సుమారు రూ.2.53 లక్షల కోట్లు).

  • రుణ-జీడీపీ నిష్పత్తి: ప్రభుత్వ ఆదాయంలో 50-60% వడ్డీ చెల్లింపులకు ఖర్చు చేయడంతో 70% పైగా ఉంది.

  • ఐఎంఎఫ్ బెయిలవుట్: ఐఎంఎఫ్ బెయిలవుట్ అనేది అధిక రుణం, కరెన్సీ అస్థిరత లేదా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సమస్యలు వంటి తీవ్రమైన ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటున్న దేశాలకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అందించే ఆర్థిక సహాయ ప్యాకేజీ. ఈ బెయిలవుట్లు సాధారణంగా రుణాల రూపంలో వస్తాయి. అందుకు తరుచూ దేశం తన ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి కఠినమైన ఆర్థిక సంస్కరణలను అమలు చేయవలసి ఉంటుంది. అందులో భాగంగా గ్యాస్ టారిఫ్ పెంపు, కొత్త పన్నులు వంటి కఠిన షరతులతో 2023లో పాకిస్థాన్ 7 బిలియన్ డాలర్ల ఐఎంఎఫ్‌ బెయిలవుట్‌ ప్యాకేజీని పొందింది.

  • విదేశీ నిల్వలు: 2025 ఏప్రిల్ నాటికి 15.4 బిలియన్ డాలర్లు(రూ.1.27 లక్షల కోట్లు). ఇది మూడు నెలల దిగుమతులకు సరిపోదు.

  • సైనిక వ్యయంపై ప్రభావం: పెరుగుతున్న అప్పుల కారణంగా పాకిస్థాన్‌ సైన్యానికి అందించే రేషన్‌ను తగ్గించింది. ఇంధన కొరత కారణంగా సైనిక విన్యాసాలను రద్దు చేయవలసి వచ్చింది.

ఇదీ  చదవండి: డబుల్‌ ప్రాఫిట్‌!

ఆర్థిక సవాళ్లు

పాకిస్థాన్ నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా దిగుమతులను భారత్ నిలిపివేయడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలైంది. ప్రస్తుతం పాకిస్థాన్‌ రూపాయి విలువ అమెరికా డాలర్‌తో పోలిస్తే రూ.281గా ఉంది. ఇది రాబోయే రోజుల్లో రూ.400కు పడిపోతుందనే భయాందోళనలు నెలకొన్నాయి. ఇటీవలి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ సాయాన్ని భారత్ వ్యతిరేకిస్తోంది. పరిమిత విదేశీ నిల్వలు, పెరుగుతున్న తిరిగి చెల్లించే అప్పులతో పాకిస్థాన్ రుణ సంక్షోభం తీవ్రమవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement