
పంజాబ్ సింధ్ నికరలాభం రెట్టింపు
కలిసొచ్చిన ఎన్‌పీఏల తగ్గుదల
ప్రధాన ఆదాయంలో పెరుగుదల
మొండిబకాయిలు తగ్గడం, ప్రధాన ఆదాయం పెరగడంతో ప్రభుత్వ రంగ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.313 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకు ముందు ఆరి్థక సంవత్సరం ఇదే క్యూ4లో ఆర్జించిన లాభం రూ.139 కోట్లతో పోలిస్తే ఇది 125% అధికం. ఇదే మార్చి త్రైమాసికంలో బ్యాంకు మొత్తం ఆదాయం రూ.2,894 కోట్ల నుంచి రూ.3,836 కోట్లకు పెరిగింది. వడ్డీ ఆదాయం రూ.2,481 కోట్ల నుంచి రూ.3,159 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) రూ.689 కోట్ల నుంచి రూ.1,122 కోట్లకు బలపడింది.
ఆస్తుల నాణ్యత పరిశీలిస్తే.. స్థూల నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏలు) 5.43% నుంచి 3.38 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్‌పీఏలు 1.63% నుంచి 0.96 శాతానికి పరిమితమయ్యాయి. ప్రొవిజన్ కవరేజ్ రేషియో 88.69% నుంచి 91.38 శాతానికి పెరిగింది. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 17.16% నుంచి 17.41 శాతానికి పెరిగింది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ.0.07 పైసల డివిడెండ్ ప్రకటించింది.
ఇదీ చదవండి: కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు లాభమా..? నష్టమా..?
పూర్తి ఆర్థిక సంవత్సరానికి గానూ నికరలాభం 71% వృద్ధి చెంది రూ.1,016 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం రూ.10,915 కోట్ల నుంచి రూ.13,049 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం రూ.2,841 కోట్ల నుంచి రూ.3,784 కోట్లకు, నికర వడ్డీ మార్జిన్ 2.45% నుంచి 2.85 శాతానికి చేరుకున్నాయి.