కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌కు లాభమా..? నష్టమా..? | Kotak Mahindra Bank reported standalone net profit | Sakshi
Sakshi News home page

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌కు లాభమా..? నష్టమా..?

May 4 2025 8:51 AM | Updated on May 4 2025 8:51 AM

Kotak Mahindra Bank reported standalone net profit

మార్చి త్రైమాసికంలో రూ.4,933 కోట్లు లాభం

రూ.2.50 డివిడెండు

సూక్ష్మ రుణాల విభాగంలో ఒత్తిళ్ల కారణంగా గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి త్రైమాసికంలో ప్రైవేట్‌ రంగ కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ నికర లాభం 8 శాతం (కన్సాలిడేటెడ్‌) క్షీణించింది. రూ.5,337 కోట్ల నుంచి తగ్గి రూ. 4,933 కోట్లకు పరిమితమైంది. స్టాండెలోన్‌ ప్రాతిపదికన నికర లాభం రూ. 4,133 కోట్ల నుంచి 14 శాతం క్షీణించి రూ. 3,552 కోట్లకు తగ్గింది. సమీక్షాకాలంలో నికర వడ్డీ ఆదాయం 5 శాతం పెరిగి రూ. 7,284 కోట్లకు చేరగా, నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) 5.28 శాతం నుంచి 4.97 శాతానికి క్షీణించింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ. 5 ముఖ విలువ గల ఒక్కో షేరుపై బ్యాంకు రూ. 2.50 చొప్పున డివిడెండ్‌ ప్రకటించింది.

మార్జిన్ల ఎఫెక్ట్‌..

పాలసీ రేట్ల కోతతో పాటు సూక్ష్మ రుణాల విభాగానికి సంబంధించిన సవాళ్ల వల్ల బ్యాంకు ఎన్‌ఐఎంలపై ప్రతికూల ప్రభావం పడింది. మైక్రోఫైనాన్స్‌ విభాగంలో సవాళ్లు మరో త్రైమాసికంపాటు కొనసాగవచ్చని, ఆ తర్వాత సాధారణ స్థాయికి రావచ్చని బ్యాంక్‌ సీఈవో అశోక్‌ వాస్వానీ తెలిపారు. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్‌ కార్డుల సెగ్మెంట్లలో తీవ్ర ఒత్తిళ్లేమీ ప్రస్తుతం లేవని ఆయన పేర్కొన్నారు. నామినల్‌ జీడీపీ వృద్ధికి 1.5 నుంచి 2 రెట్లు రుణ వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వాస్వానీ చెప్పారు. పోటీ బ్యాŠంకుల తరహాలోనే స్వల్పకాలికంగా తమ ఎన్‌ఐఎంపైనా ఒత్తిళ్లు కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఏ అనుబంధ సంస్థలోనూ వాటాలను విక్రయించే యోచనేదీ లేదని తెలిపారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆంక్షల నుంచి బైటపడటంతో వచ్చే ఆరు నెలల్లో, పూర్వ స్థాయికి నెలవారీ క్రెడిట్‌ కార్డుల జారీని పెంచుకోనున్నట్లు వాస్వానీ చెప్పారు. రుణాల పోర్ట్‌ఫోలియోలో అన్‌సెక్యూర్డ్‌ లోన్స్‌ (క్రెడిట్‌ కార్డులు, వ్యక్తిగత రుణాలు మొదలైనవి) వాటా 10.5 శాతానికి తగ్గిందని, దీన్ని 15 శాతానికి పెంచుకోవడంపై దృష్టి పెడతామని వివరించారు.  

ఇదీ చదవండి: తగ్గిన మొండిబాకీలు.. పెరిగిన ఆదాయం

మరిన్ని కీలకాంశాలు..

  • మార్చి క్వార్టర్‌లో స్టాండెలోన్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం రూ.15,285 కోట్ల నుంచి రూ.16,712 కోట్లకు పెరిగింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.27,907 కోట్ల నుంచి రూ.27,174 కోట్లకు తగ్గింది.  

  • పూర్తి ఆర్థిక సంవత్సరానికి బ్యాంక్‌ నికర లాభం (స్టాండెలోన్‌) రూ.13,782 కోట్ల నుంచి రూ.16,450 కోట్లకు (కోటక్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ను విక్రయించడం ద్వారా వచ్చిన రూ.2,730 కోట్లతో పాటు) చేరింది. వార్షికంగా చూస్తే ఇది 19 శాతం అధికం. కోటక్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ విక్రయ మొత్తాన్ని మినహాయిస్తే నికర లాభం రూ.13,720 కోట్లు వచ్చింది.  

  • మొండిబాకీల విషయానికొస్తే.. స్థూల ఎన్‌పీఏలు 1.39 శాతం నుంచి స్వల్పంగా పెరిగి 1.42 శాతానికి చేరాయి. అయితే, నికర ఎన్‌పీఏలు మాత్రం 0.34 శాతం నుంచి 0.31 శాతానికి తగ్గాయి.  

  • గ్రూప్‌ లాభాల్లో అనుబంధ సంస్థల వాటా 29 శాతం పెరగడంతో, సూక్ష్మ రుణాలు..ఆర్‌బీఐ ఆంక్షల వల్ల తలెత్తిన సవాళ్లను బ్యాంకు కొంత అధిగమించగలిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement