
క్యూ4లో ఇండియన్ బ్యాంక్ లాభం 32 శాతం అప్
గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఇండియన్ బ్యాంక్ ప్రోత్సాహకరమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మొండిబాకీలు తగ్గడం, ఆదాయం పెరగడంతో రూ.2,956 కోట్ల నికర లాభం నమోదు చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి త్రైమాసికంలో నమోదైన రూ.2,247 కోట్లతో పోలిస్తే ఇది 32 శాతం అధికం. ఇక బ్యాంకు మొత్తం ఆదాయం రూ.16,887 కోట్ల నుంచి రూ.18,599 కోట్లకు ఎగిసింది. నికర వడ్డీ ఆదాయం రూ.6,015 కోట్ల నుంచి రూ.6,389 కోట్లకు చేరింది. అసెట్ క్వాలిటీపరంగా చూస్తే స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏ) 3.95 శాతం నుంచి 3.09 శాతానికి దిగి వచ్చాయి. అలాగే, నికర ఎన్‌పీఏలు కూడా 0.43 శాతం నుంచి 0.19 శాతానికి తగ్గాయి.
ఇదీ చదవండి: కథన రంగంలో ఏఐ చిందులు
రూ.16.25 డివిడెండ్..
పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 10 ముఖ విలువ చేస ఒక్కో షేరుపై బ్యాంకు రూ. 16.25 చొప్పున డివిడెండు ప్రకటించింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు నికర లాభం 35 శాతం వృద్ధి చెంది రూ. 8,063 కోట్ల నుంచి రూ. 10,918 కోట్లకు పెరిగింది. ఆదాయం రూ. 63,482 కోట్ల నుంచి రూ. 71,226 కోట్లకు ఎగిసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ, బాండ్ల జారీ ద్వారా రూ. 7,000 కోట్లు సమీకరించే ప్రతిపాదనకు బ్యాంకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇందులో రూ. రూ. 5,000 కోట్ల మొత్తాన్ని క్విప్ లేదా రైట్స్ ఇష్యూ లేదా రెండింటి మేళవింపుతో బ్యాంకు సమీకరించుకోనుంది. మరో 2,000 కోట్లను బాండ్ల ద్వారా సమకూర్చుకోనుంది.