
ఇండియన్ బ్యాంక్ ప్రకటన
ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్‌ఫ్రా రూ.463 కోట్ల ఎగవేత నేపథ్యం
సాక్షి, అమరావతి: ఇండియన్ బ్యాంక్ నుంచి ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్‌ఫ్రా అనే సంస్థ భారీగా రుణం తీసుకుని తిరిగి చెల్లించని వ్యవహారంలో రుణానికి హామీగా ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన బంధువుల ఆస్తుల వేలం ప్రక్రియ ప్రారంభమైంది. ఇండియన్ బ్యాంక్, కోఠి స్ట్రెస్డ్ అసెట్స్ మేనేజ్‌మెంట్ బ్రాంచ్ విడుదల చేసిన తాజా ప్రకటన ప్రకారం, బకాయిలు వసూలు చేసేందుకు మే 21 మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య మూడు స్థిరాస్తుల వేలం ప్రక్రియ జరగనుంది.
ఇప్పటికి రూ.463 కోట్లు...
2016 నాటికి రూ.141 కోట్లు ఉన్న రుణ బకాయిలు, 2025 ఏప్రిల్ 27 నాటికి వడ్డీ, పెనాల్టీలు కలిపి రూ.463.01 కోట్లకు పెరిగినట్టు బ్యాంకు తెలిపింది. ఈ రుణాలకు గంటాతో పాటు పరుచూరి రాజారావు, పీవీ భాస్కరరావు, పరుచూరి వెంకయ్య, ప్రభాకరరావు, కొండయ్య బాలసుబ్రమణ్యం, నార్ని అమూల్య, ప్రత్యూష ఎస్టేట్స్, ప్రత్యూష గ్లోబల్ ట్రేడ్స్ హామీదారులుగా ఉన్నారు.
ఇప్పుడైనా ముడిపడేనా..!
గంటా కుటుంబం ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్‌ఫ్రా పేరుతో విశాఖపట్నం లక్ష్మీ టాకీస్ సమీపంలో ఒక కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ కంపెనీలో యాక్టివ్ డైరెక్టర్లుగా గంటా సమీప బంధువు పరుచూరి వెంకట భాస్కరరావు, ఆయన సోదరులు రాజారావు, వెంకయ్య ప్రభాకరరావులున్నారు. విస్తరణ పేరుతో కంపెనీ డాబాగార్డెన్స్ శారదావీధిలోని ఇండియన్ బ్యాంకు నుంచి భారీ రుణాలు తీసుకుంది. ఈ రుణ బకాయిలకు సంబంధించి 2016 నుంచి డిమాండ్ నోటీసులు పంపడం, వేలం ప్రకటనలు, రిజర్వ్ ధరల పెంపు మాత్రమే జరుగుతుండగా, వేలం మాత్రం జరగడం లేదు. గంటా రాజకీయంగా తనకున్న పలుకుబడిని ఉపయోగించుకొని వేలాన్ని నిలుపుదల చేయించడం పరిపాటిగా మారిపోయింది.

- వేలం వేయనున్న ఆస్తులు..
ప్రత్యూష అసోసియేట్స్ పేరిట విశాఖపట్నంలోని గంగులువారి వీధిలో ఉన్న 274.65 చదరపు అడుగుల వాణిజ్య భవనం. - ప్రత్యూష ఎస్టేట్స్‌కు చెందిన ద్వారకానగర్ శ్రీ శాంత కాంప్లెక్స్‌లోని 1250 చదరపు అడుగుల రెండు ప్లాట్లు.
- వుడా లేఅవుట్‌లోని అయిదు ప్లాట్లు
ఈ ఆస్తులకు బ్యాంకు రూ.3.39 కోట్ల రిజర్వ్ ధరను నిర్ణయించింది.
‘ఉద్దేకపూర్వక రుణ ఎగవేతదారుడిగా’ ప్రకటించాలని డిమాండ్లుమరోవైపు రుణం తిరిగి చెల్లించే ఉద్దేశం
గంటాకు లేదని, అతడిని ‘ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుడిగా’ ప్రకటించాలని బ్యాంకింగ్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.
– ఇండియన్ బ్యాంక్ ప్రకటన
ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్‌ఫ్రా రూ.463 కోట్ల ఎగవేతల నేపథ్యం
రుణానికి తనఖాగా గంటా తదితరుల ఆస్తులు