
అన్ని సేవింగ్స్ ఖాతాలకు సంబంధించి కనీస బ్యాలెన్స్ నిర్వహణ చార్జీలను ఎత్తివేస్తున్నట్టు ప్రభుత్వరంగ ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. జూలై 7 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. దీనివల్ల మరింత మందికి బ్యాంకింగ్ సేవలు చౌకగా అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.
మరోవైపు ఇండియన్ బ్యాంక్ ఏడాది కాల మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్‌ఆర్) 5 బేసిస్ పాయింట్లు (0.05శాతం) తగ్గించి 9 శాతానికి సవరించినట్టు ప్రకటించింది. 3వ తేదీ నుంచి ఈ రేటు అమల్లోకి వస్తుందని తెలిపింది. దీనివల్ల రుణగ్రహీతలకు ఉపశమనం లభిస్తుందని పేర్కొంది. ఆటో, వ్యక్తిగత, గృహ రుణాల రేట్లకు ఏడాది కాల ఎంసీఎల్‌ఆర్ బెంచ్‌మార్క్‌గా ఉంటుంది.

పొదుపు ఖాతాలలో కనీస సగటు బ్యాలెన్స్ (ఎంఏబీ) నిర్వహించకపోతే విధించే జరిమానా ఛార్జీలను ఎత్తివేస్తున్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కూడా ఇదివేరకే ప్రకటించింది. అంతకు ముందు కెనరా బ్యాంక్ కూడా అన్ని పొదుపు ఖాతాల్లో కనీస సగటు బ్యాలెన్స్ (ఎంఏబీ) నిర్వహించనందుకు విధించే పెనాల్టీ ఛార్జీలను తొలగించింది. ఎంఏబీ అనేది ఒక నిర్దిష్ట కాలంలో (సాధారణంగా నెల) మీ పొదుపు ఖాతాలో నిర్వహించాల్సిన సగటు మొత్తం.