
ద్విచక్ర ఈవీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ ఇండస్ట్రీస్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర నష్టం రెట్టింపై రూ. 870 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది (2023–24) ఇదే కాలంలో రూ. 416 కోట్ల నష్టం మాత్రమే నమోదైంది. అయితే ఈ ఏడాది(2025–26) టర్న్‌అరౌండ్ సాధించనున్నట్లు కంపెనీ పేర్కొంది. కాగా.. మొత్తం ఆదాయం సైతం రూ. 1,598 కోట్ల నుంచి రూ. 611 కోట్లకు క్షీణించింది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర నష్టం భారీగా పెరిగి రూ. 2,276 కోట్లకు చేరింది. 2023–24లో రూ. 1,584 కోట్ల నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ. 5,010 కోట్ల నుంచి రూ. 4,514 కోట్లకు డీలా పడింది.
సుజ్లాన్ ఎనర్జీ లాభం దూకుడు
క్యూ4లో రూ. 1,181 కోట్లు
పవన విద్యుత్ రంగ దిగ్గజం సుజ్లాన్ ఎనర్జీ కన్సాలిడేటెడ్ నికర లాభం గతేడాది(2024–25) చివరి త్రైమాసికం(క్యూ4)లో 5 రెట్లు దూసుకెళ్లి రూ. 1,181 కోట్లకు చేరింది. అమ్మకాలు పుంజుకోవడం ఇందుకు ప్రధానంగా సహకరించింది. అంతక్రితం ఏడాది (2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 254 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 2,207 కోట్ల నుంచి రూ. 3,825 కోట్లకు ఎగసింది. పూర్తి ఏడాదికి కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 660 కోట్ల నుంచి రూ. 2,072 కోట్లకు జంప్‌చేసింది. మొత్తం ఆదాయం రూ. 6,568 కోట్ల నుంచి రూ. 10,993 కోట్లకు పెరిగింది.
బజాజ్ ఆటో లాభం డౌన్
ద్విచక్ర, త్రిచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 10%నీరసించి రూ. 1,802 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 2,011 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 11,555 కోట్ల నుంచి రూ. 12,646 కోట్లకు బలపడింది. ఈ కాలంలో 11,02,934 వాహనాలు విక్రయించింది. అంతక్రితం క్యూ4లో 10,68,576 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. వాటాదారులకు షేరుకి రూ. 210 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 5 శాతం నీరసించి రూ. 7,325 కోట్లకు చేరింది. 2023–24లో రూ.7,708 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 44,870 కోట్ల నుంచి రూ. 50,995 కోట్లకు ఎగసింది. మొత్తం వాహన విక్రయాలు 7% పుంజుకుని 46,50,966 యూనిట్లను తాకాయి.
పోకర్ణ లాభం రూ.59 కోట్లు
గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో పోకర్ణ లిమిటెడ్ నికర లాభం సుమారు 280 శాతం వృద్ధి చెంది రూ. 59 కోట్లకు ఎగిసింది. ఆదాయం 62 శాతం వృద్ధి చెంది రూ. 263 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను లాభం 115 శాతం పెరిగి రూ. 186 కోట్లకు, ఆదాయం 35 శాతం వృద్ధి చెంది రూ. 930 కోట్లకు చేరాయి. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ 30 శాతం డివిడెండ్ ప్రకటించింది. అంతర్జాతీయంగా అసాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ పటిష్టమైన పనితీరు సాధించగలిగామని సంస్థ చైర్మన్ గౌతమ్ చంద్ జైన్ తెలిపారు.