పిల్లల ఉన్నత విద్య కోసం.. ఇంటర్నేషనల్‌ ఫండ్స్‌ గురించి తెలుసా?

Do you know international funds check the details - Sakshi

మూడు నుంచి ఆరు నెలల కాలానికి రూ.50 వేలు ఇన్వెస్ట్‌ చేయాలని అనుకుంటున్నాను. మెరుగైన రాబడుల కోసం ఈ మొత్తాన్ని ఎక్కడ ఇన్వెస్ట్‌ చేసుకోవాలి?  –సంతోష్‌ కుమార్‌

పెట్టుబడులకు చాలా స్వల్పకాలం ఉంది. కనుక మెరుగైన రాబడుల కోసం పెట్టుబడిపై రిస్క్‌ తీసుకోవడం సరికాదు. పెట్టుబడికి భద్రత ఎక్కువ ఉండాలి. రాబడుల కంటే పెట్టుబడిని కాపాడుకునే విధంగా వ్యూహం ఉండాలి. కనుక ఈ మొత్తాన్ని మీరు బ్యాంకు ఖాతాలోనే ఉంచుకోవచ్చు. లేదంటే ఆరు నెలల కోసం ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. వీటిల్లో రాబడులు తక్కువే అయినా గ్యారంటీతో కూడినవి. పైగా పెట్టుబడికి భద్రత ఎక్కువ.

బ్యాంకులో చేసే డిపాజిట్‌ రూ.5 లక్షల వరకు డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ నుంచి బీమా ఉంటుంది. అలాగే, లిక్విడ్‌ ఫండ్స్‌లోనూ ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఇవి ట్రెజరీ బిల్లులు, ప్రభుత్వ సెక్యూరిటీలు, రెపో సర్టిఫికెట్లలో ఇన్వెస్ట్‌ చేస్తాయి. గరిష్టంగా 91 రోజుల కాల వ్యవధి కలిగిన సెక్యూరిటీల్లోనే లిక్విడ్‌ పథకాలు ఇన్వెస్ట్‌ చేస్తాయి. బ్యాంకు డిపాజిట్ల కంటే లిక్విడ్‌ ఫండ్స్‌లో కొంచెం అదనపు రాబడి వస్తుంది. కాకపోతే పెట్టుబడి భద్రతకు అవి హామీ ఇవ్వవు.

నేను యూఎస్‌ లేదా గ్లోబల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నాను. ఇందుకోసం ఫండ్స్‌ను ఎలా ఎంపిక చేసుకోవాలి? వీటికి ఎంత మేర కేటాయింపులు చేసుకోవాలి? – వరుణ్‌ 

దేశం వెలుపలి ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే పథకాలను ఇంటర్నేషనల్‌ ఫండ్స్‌ అని పిలుస్తారు. తమ పిల్లలను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించాలని కోరుకునే వారు ఇంటర్నేషనల్‌ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. విదేశీ కరెన్సీలో అయ్యే వ్యయాలకు ముందు నుంచే ఈ రూపంలో ప్రణాళిక మేరకు ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. 

పిల్లలు స్కూల్‌లో చేరినప్పటి నుంచి వారి భవిష్యత్‌ విదేశీ విద్య కోసం ఇంటర్నేషనల్‌ ఫండ్స్‌లో సిప్‌ ద్వారా క్రమానుగతంగా ఇన్వెస్ట్‌ చేస్తూ వెళ్లాలి. దేశీయంగా మెరుగైన రాబడులను ఇచ్చే పథకాలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ కరెన్సీ విలువల పరంగా ఉండే రిస్క్‌ను దృష్టిలో పెట్టుకుని కొంత మొత్తాన్ని మంచి రాబడినిచ్చే అంతర్జాతీయ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవడం మేలైన నిర్ణయం అవుతుంది. వివిధ రంగాల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే వైవిధ్యంతో కూడిన ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవాలి. మనం భారత్‌లో నివసిస్తున్నప్పుడు, మన ఆదాయం, వ్యయాలు, ఆస్తులన్నీ ఇక్కడే ఉంటాయి. 

అంతర్జాతీయ పెట్టుబడులు అన్నవి మన మార్కెట్‌తో సంబంధం కలిగి ఉండవు. కాకపోతే ఈ మార్గం ద్వారా తగినంత వైవిధ్యాన్ని పాటించొచ్చు. అలాగే, కేవలం ఒకే రంగంలో పెట్టుబడులు పెట్టే ఇంటర్నేషనల్‌ ఫండ్స్‌కు దూరంగా ఉండాలి. ఇంటర్నేషనల్‌ ఫండ్స్‌ థీమ్యాటిక్‌ ఫండ్‌ లేదా కమోడిటీ ఫండ్‌ లేదా ఒకే దేశానికే సంబంధించి పెట్టుబడులతో కూడిన పథకాల్లో రిస్క్‌ ఉంటుంది. అప్పటి వరకు సానుకూలంగా ఉన్న రాబడులు ప్రతికూలంగా మారిపోవచ్చు. అందుకని వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియోతో ఉన్న పథకాలను ఎంపిక చేసుకోవాలి.  

అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్లో డాలర్‌ విలువ ఏటేటా బలపడుతోంది. 2017లో యూఎస్‌ డాలర్‌ రూపాయితో 65 దగ్గర ఉంటే, ఇప్పుడు 83కు చేరింది. ఐదేళ్లలో ఏటా 4 శాతానికి పైనే డాలర్‌ బలపడింది. డాలర్‌ మారకంలో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల ఈ విధమైన కరెన్సీ ప్రయోజనాన్ని పొందొచ్చు.

డాలర్‌ మారకంతో కూడిన ఇంటర్నేషనల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా క్షీణించే రూపాయి విలువ పరంగా రక్షణ ఉంటుంది. ఫలితంగా మెరుగైన రాబడి అందుకోవచ్చు. అలాగే, ఈక్విటీ పథకాల మాదిరే ఇంటర్నేషనల్‌ ఫండ్స్‌లోనూ దీర్ఘకాలం దృష్టితోనే పెట్టుబడులు పెట్టాలి. ఏడాది, మూడేళ్ల కాల పనితీరు చూసి పెట్టుబడులు పెట్టకూడదు. ఇంటర్నేషనల్‌ ఫండ్స్‌ను ఆదాయపన్ను చట్టం నాన్‌ ఈక్విటీ పథకాలుగా పరిగణిస్తుంది. కనుక డెట్‌ ఫండ్స్‌ మాదిరే పన్ను విధానం అమలవుతుంది.


- ధీరేంద్ర కుమార్సీఈవో వాల్యూ రీసెర్చ్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top