దీపావళి ధమాకా!

Diwali 2023: Diwali sees record trade of Rs 3.75 lakh crore says CAIT - Sakshi

పండుగ సీజన్‌లో ఇప్పటివరకు రూ. 3.75 లక్షల కోట్ల వ్యాపారం

మరో రూ. 50,000 కోట్ల వరకు వ్యాపార అంచనాలు

సీఏఐటీ వెల్లడి

న్యూఢిల్లీ: దేశీయంగా పండుగ సీజన్‌ సందర్భంగా రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు రూ. 3.75 లక్షల కోట్ల మేర విక్రయాలు జరిగినట్లు అఖిల భారతీయ ట్రేడర్ల సమాఖ్య (సీఏఐటీ) వెల్లడించింది. రాబోయే గోవర్ధన పూజ, భాయ్‌ దూజ్, ఛత్‌ పూజ వంటి పర్వదినాల సందర్భంగా మరో రూ. 50,000 కోట్ల మేర వ్యాపారం జరగవచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించింది.

ఈసారి దీపావళికి ఎక్కువగా దేశీయంగా తయారైన ఉత్పత్తులే అమ్ముడైనట్లు సీఏఐటీ సెక్రటరీ జనరల్‌ ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ తెలిపారు. చైనా ఉత్పత్తులకు రూ. 1 లక్ష కోట్ల మేర వ్యాపారం తగ్గిపోయిందని పేర్కొన్నారు. ‘గతంలో దీపావళి పండుగ సందర్భంగా అమ్మకాల్లో చైనా ఉత్పత్తుల వాటా దాదాపు 70 శాతం ఉండేది. కానీ ఈసారి దేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునకు ఇటు వ్యాపారవర్గాలు, అటు వినియోగదారుల నుంచి భారీగా స్పందన లభించింది‘ అని ఆయన వివరించారు.

ఇలా ఖర్చు చేశారు..
కస్టమర్లు ఈ దీపావళికి ఫుడ్, గ్రాసరీపై 13 శాతం వెచ్చించారు. వస్త్రాలు, దుస్తులపై 12 శాతం, ఆభరణాలకు 9 శాతం, ఎలక్ట్రానిక్స్, మొబైల్స్‌పై 8 శాతం, బహుమతులకు 8 శాతం, కాస్మెటిక్స్‌కు 6 శాతం ఖర్చు చేశారు. డ్రైప్రూట్స్, స్వీట్స్, నమ్కీన్‌ 4 శాతం, ఫర్నీషింగ్, ఫర్నీచర్‌ 4 శాతం, గృహాలంకరణ 3 శాతం, పూజా సామగ్రి 3, పాత్రలు, వంటింటి ఉపకరణాలు 3 శాతం, కన్ఫెక్షనరీ, బేకరీ 2 శాతం కైవసం చేసుకున్నాయి. ఆటోమొబైల్, హార్డ్‌వేర్, ఎలక్ట్రికల్, బొమ్మలు, ఇతర వస్తువులకు 20 శాతం వెచి్చంచారని సీఏఐటీ తెలిపింది.  
అన్ని విభాగాల్లోనూ జోష్‌..
రిటైల్‌లో అన్ని విభాగాలు మెరుగ్గా పనితీరు కనబరిచాయి. అమ్మకాల పరంగా ఆన్‌లైన్‌కు, ఆఫ్‌లైన్‌కు వ్యత్యాసం లేదని రిటైల్‌ రంగ నిపుణుడు కళిశెట్టి పి.బి.నాయుడు తెలిపారు. మొత్తం రిటైల్‌ వ్యాపారంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వాటా 16 శాతం ఉందన్నారు. తెలుగు రాష్ట్రా ల్లో గతేడాదితో పోలిస్తే ఈ దీపావళికి డైమండ్‌ జువెల్లరీ విక్రయాలు 15–20 శాతం, బంగారు ఆభరణాలు 35 శాతం దూసుకెళ్లాయని హీరావాలా జెమ్స్, జువెల్లర్స్‌ ఎండీ గౌతమ్‌ చవాన్‌ తెలిపారు.  

ఆంధ్రప్రదేశ్‌లో రూ. 19,000 కోట్లపైనే..
ఇక, దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో రూ.19,000 కోట్లపైన వ్యాపార అమ్మకాలు జరిగినట్లు మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో అత్యధికంగా దుస్తులు, నిత్యావసర వస్తువులు, టపాసులు, గృహోపకరణాలు జరిగినట్లు తెలిపాయి. దీపావళి అంటే టపాసులతో పాటు స్వీట్లకు అత్యధిక ప్రాధాన్యత ఉండటంతో వీటికోసమే రూ.3,800 కోట్ల వరకు వ్యయం చేసినట్లు పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా సగటున ప్రతి ఒక్కరు దీపావళి పర్వదినం సందర్భంగా రూ.3,500 వరకు ఖర్చు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయని, ఆ లెక్కన చూస్తే రాష్ట్రంలో దీపావళి సందర్భంగా రూ.19,000 కోట్లపైన మార్కెట్‌ జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top