మ్యూచువల్‌ ఫండ్‌ను కానుకగా ఇవ్వొచ్చా..?

Details About Gold ETF and Sovereign Gold bonds - Sakshi

ఒక మ్యూచువల్‌ ఫండ్‌ పథకంలో నాకు పెట్టబడులు ఉన్నాయి. వీటిని ఎవరికైనా బహుమతిగా ఇవ్వొచ్చా? – శ్రీలలిత 
మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకంలోని యూనిట్లు ఒకరికి బదిలీ చేయడం కానీ, బహుమతిగా ఇవ్వడం కానీ కుదరదు. ఇన్వెస్టర్‌ తన పేరిట ఉన్న యూనిట్లు వేరొకరికి బదిలీ చేయడం అన్నది కేవలం.. ఇన్వెస్టర్‌ మరణించిన సందర్భాల్లోనే చోటు చేసుకుంటుంది. అటువంటి సందర్భంలో నామినీ క్లెయిమ్‌ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ఇన్వెస్టర్‌ మరణ ధ్రువీకరణ పత్రం, కేవైసీ డాక్యుమెంట్లను సమర్పించాలి. అన్నింటినీ పరిశీలించిన తర్వాత మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లను నామినీ పేరుమీదకు అప్పుడు బదలాయిస్తారు. మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులను పిల్లలకు బహుమతిగా ఇవ్వాలని అనుకుంటే నేరుగా వారి పేరుతో ఇన్వెస్ట్‌ చేయడం ఒక్కటే మార్గం. పిల్లల వయసు 18 ఏళ్లలోపు ఉన్నా ఇది సాధ్యపడుతుంది. అటువంటప్పుడు పిల్లలు మేజర్‌ అయ్యే వరకు తల్లిదండ్రులే సంబంధింత పెట్టుబడులపై సంరక్షకులుగా నిర్ణయాధికారం కలిగి ఉంటారు. పిల్లల పుట్టిన తేదీ సర్టిఫికెట్‌తోపాటు, గార్డియన్‌ కేవైసీ వివరాలను మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ అడుగుతుంది. పిల్లల పేరిట (మైనర్లు) ఉన్న మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులను విక్రయించగా వచ్చిన ఆదాయం.. తల్లిదండ్రుల ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ పిల్లల వయసు 18 ఏళ్లు నిండిన తర్వాత పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే అది వారి వ్యక్తిగత ఆదాయం కిందకే వస్తుంది. మీ పేరిట ఉన్న మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులను పిల్లలకు బహుమతిగా ఇవ్వాలనుకుంటే, పిల్లల వయసు 18 ఏళ్లు నిండి ఉంటే అందుకు మార్గం లేదు. మీ పేరిట ఉన్న పెట్టుబడులను విక్రయించేసి, వచ్చిన మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాకు బదిలీ చేయాలి. ఆ తర్వాత వారి పేరిట కొనుగోలు చేసుకోవాలని సూచించడమే మార్గం. మూడో వ్యక్తి (థర్డ్‌ పార్టీ) నుంచి పెట్టుబడిని ఫండ్స్‌ సంస్థలు ఆమోదించవు. మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్లు కొనుగోలు చేస్తున్న వ్యక్తి స్వయంగా ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కనుక బహుమతిగా ఇవ్వాలనుకునే వారికి నగదు బదిలీ చేసి, కొనుగోలు చేసుకోవాలని సూచించడమే మార్గం.  

గోల్డ్‌ ఈటీఎఫ్‌లతో సావరీన్‌ గోల్డ్‌ బాండ్లను పోల్చి చూడడం ఎలా? ఎస్‌జీబీలు మెరుగైన ఆప్షనేనా?  -  జోసెఫ్‌ 
బంగారంలో ఇన్వెస్ట్‌ చేయాలని భావించే వారికి ఈటీఎఫ్‌లతో పోలిస్తే సావరీన్‌ గోల్డ్‌ బాండ్లు (ఎస్‌జీబీలు) మెరుగైన ఆప్షన్‌ అవుతాయి. ఎస్‌జీబీలో ఇన్వెస్ట్‌ చేస్తే వార్షికంగా 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. బంగారం ధరల్లో వృద్ధికి ఇది అదనపు ప్రయోజనం. కానీ, గోల్డ్‌ ఈటీఎఫ్‌లు అలా కాదు. మార్కెట్‌ ధరల పరంగా వచ్చిన లాభం ఒక్కటే ప్రయోజనం. ఎస్‌జీబీల్లో వడ్డీని అదనపు ప్రయోజనం కింద చూడాలి. ఎస్‌బీజీలను కొనుగోలు చేయడం వల్ల ఎటువంటి వ్యయాలు, నిర్వహణ చార్జీల్లేవు. గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో ఎక్స్‌పెన్స్‌ రేషియో పేరిట ఒక శాతం కోల్పోవాల్సి వస్తుంది. పన్నుల పరంగా చూసినా ఎస్‌జీబీలు మెరుగైనవి. ఎస్‌జీబీల్లో బంగారం ధరల వృద్ధి రూపంలో వచ్చే లాభంపై పన్ను లేదు. 8 ఏళ్ల కాల వ్యవధి పూర్తయ్యే వరకు ఉంచుకుంటేనే ఈ ప్రయోజనం. ఎస్‌జీబీలో పెట్టుబడిపై ఏటా స్వీకరించే 2.5 శాతం వడ్డీ ఆదాయం మాత్రం పన్ను వర్తించే ఆదాయం పరిధిలోకి వస్తుంది. ఇన్వెస్టర్ల ఆదాయం పన్ను పరిధిలో ఉంటేనే ఎస్‌జీబీల లాభంపై పన్ను పడుతుంది. గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో లాభం మూలధన లాభాల పన్ను పరిధిలోకి వస్తుంది. అది కూడా ఈక్విటీయేతర మూలధన లాభాల పన్ను  అమలవుతుందని గుర్తుంచుకోవాలి. ఒక్కలిక్విడిటీ విషయంలోనే ఎస్‌జీబీలు ఈటీఎఫ్‌ల కంటే దిగువన ఉంటాయి. ఎస్‌జీబీలను ఐదేళ్ల తర్వాత నుంచి ఆర్‌బీఐకి స్వాధీనం చేసి పెట్టుబడిని పొందొచ్చు. ఐదేళ్లలోపు అయితే స్టాక్‌ ఎక్సేంజ్‌ల్లో విక్రయించుకోవాలి. ఇక్కడ లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. గోల్డ్‌ ఈటీఎఫ్‌లు అలా కాదు. వాటికి లిక్విడిటీ తగినంత ఉంటుంది. కనుక గడువులోపు విక్రయించుకోవాల్సిన అవసరం లేని వారికి ఎస్‌జీబీలు మెరుగైనవి.  
- ధీరేంద్ర కుమార్‌ (సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌)

చదవండి: కష్టపడినా.. ఆదాయం పెరగడం లేదా? అయితే..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top