రియల్టీ స్టార్టప్స్‌కు మంచిరోజులు: రూ.800 కోట్ల ఫండ్‌  

CREDAI Venture Catalysts set up usd100 million proptech fund to support startups in real estate - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రియల్టీ రంగంలో మరో మైలురాయి.ఈ పరిశ్రమలో వినూత్న పరిష్కారాలు,సేవలను పరిచయం చేసేందుకు సిద్ధమైన స్టార్టప్స్‌లో పెట్టుబడులు చేసేందుకు కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడాయ్‌), ఇంక్యుబేటర్, స్టార్టప్స్‌ యాక్సిలరేటర్‌ అయిన వెంచర్‌ క్యాటలిస్ట్స్‌ ముందుకు వచ్చాయి.

ఇరు సంస్థలు రూ.800 కోట్ల ప్రాపర్టీ టెక్నాలజీ ఫండ్‌ను ఏర్పాటు చేశాయి. సాంకేతికత, డేటా అనలిటిక్స్, బ్లాక్‌చైన్, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ ఆధారంగా పరిశ్రమను మార్చగల సామర్థ్యం ఉన్న ప్రారంభ, వృద్ధి దశలో ఉన్న స్టార్టప్స్‌కు ఈ ఫండ్‌ ద్వారా నిధులను సమకూరుస్తాయి. గృహ, వాణిజ్య, సంస్థాగత, పారిశ్రామిక విభాగాలకు సేవలు అందించే స్టార్టప్స్‌లో పెట్టుబడి చేస్తాయి.

ప్రస్తుతం భారత రియల్టీ రంగం 300 బిలియన్‌ డాలర్లుగా ఉంది. పరిశ్రమ 2030 నాటికి 1 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకోవడానికి ఆవిష్కరణలు, సాంకేతిక పురోగతి దోహదం చేస్తుందని క్రెడాయ్‌ తెలిపింది. క్రెడాయ్‌లో డెవలపర్స్, వెండార్స్, చానెల్‌ పార్ట్‌నర్స్, ప్రమోటర్స్‌ వంటి 256 విభాగాల నుంచి 13,000 పైచిలుకు సభ్యులు ఉన్నారు. ఓయో, బేసిక్, షేర్‌నెస్ట్, హోమ్‌ క్యాపిటల్‌ వంటి రియల్టీ రంగ స్టార్టప్స్‌లో వెంచర్‌ క్యాటలిస్ట్‌ పెట్టుబడి చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top