పర్యాటకానికి సమ్మర్‌ బొనాంజా!

COVID 19 Vaccination Will Boost Confidence in Travelers - Sakshi

వ్యాక్సినేషన్‌తో టూరిస్ట్‌లలో పెరిగిన విశ్వాసం 

విదేశాల కంటే దేశీయ పర్యాటక ప్రాంతాలకే డిమాండ్‌ 

ఎంక్వైరీలు, బుకింగ్స్‌తో ట్రావెల్, హోటల్స్‌ బిజిబిజీ 

దేశీయ ప్రయాణ, పర్యాటక రంగానికి వేసవి కాలం కలిసి రానుంది. మన దేశంతో పాటు ప్రపంచంలోని ప్రధాన దేశాలన్నింట్లోనూ కోవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జోరుగా సాగుతోంది. దీంతో పర్యాటకులకు విశ్వాసం పెరిగిందని.. దేశీయ, విదేశీ పర్యాటక ప్రాంతాలకు డిమాండ్‌ ఊపందుకుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది సమ్మర్‌తో పోలిస్తే ఈసారి అందుబాటులో ఉన్న ట్రావెల్, హోటల్స్‌ ధరలూ పర్యాటకులను రా..రమ్మంటు ఆకర్షిస్తున్నాయి. మొత్తంగా ఈ వేసవి దేశీయ ప్రయాణ, పర్యాటక పరిశ్రమకు మంచి రోజులేనని నిపుణులు చెబుతున్నారు. 

సాధారణంగా ప్రతీ ఏటా 2.7 నుంచి 3 కోట్ల వరకు భారతీయులు విదేశాల్లో ట్రావెల్‌ చేస్తుంటారు. కోవిడ్‌–19 వ్యాప్తి, ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో గత ఏడాది కాలంగా వీరంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రస్తుతం కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ జోరుగా సాగుతుండటంతో పర్యాటకుల్లో నమ్మకం, విశ్వాసం ఏర్పడిందని, దీంతో టూరిస్ట్‌ ప్రాంతాలకు ప్రయాణీకులు మొగ్గు చూపుతున్నారని మేక్‌మై ట్రిప్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ విపుల్‌ ప్రకాశ్‌ తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఏడాది కాలంగా దెబ్బతిన్న హోటల్స్, ట్రావెల్‌ వ్యాపారస్తులు ఈ వేసవి సెలవుల్లో దేశీయ ప్రయాణికుల నుంచి డిమాండ్‌ను ఎక్కువ పొందాలని ఆశిస్తున్నారు. 

ఈ ధోరణి పర్యాటక, ఆతిథ్య రంగానికి కొంత మేలవుతుందన్నారు. వేసవి ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు, ఏడాది కాలంగా ఇంటికే పరిమితమైన వాళ్లు కుటుంబంతో కలిసి ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య కాలంలో వేసవికాలం సెలవులలో విదేశాలకు లేదా దేశీయంగా ఉన్న హిల్‌ స్టేషన్లు, బీచ్‌లు, రిసార్ట్స్‌ వంటి ప్రదేశాలకు వెళ్లేందుకు ప్రణాళికలు చేస్తున్నారని చెప్పారు. దీంతో టికెట్ల బుకింగ్స్, పర్యాటక ప్రదేశాల కోసం ఆన్‌లైన్‌ శోధన చేయడం పెరిగిందన్నారు. ఏడాది క్రితంతో పోలిస్తే రానున్న సమ్మర్‌ హాలిడేస్‌ కోసం మేక్‌మై ట్రిప్‌లో రోజుకు 70 శాతం బుకింగ్స్‌ పెరిగాయని విపుల్‌ ప్రకాశ్‌ తెలిపారు. 

నేటి ఎంక్వైరీలే రేపటి బుకింగ్స్‌.. 
గతేడాది వేసవికాలం ముందస్తు బుకింగ్స్‌తో పోలిస్తే ఈ ఏడాది సమ్మర్‌ సీజన్‌లో ఆన్‌లైన్‌ ట్రావెల్‌ ఏజెంట్స్‌ (ఓటీఏ), హోటళ్ల ఎంక్వైరీలు పెరిగాయి. ఆయా శోధనలు బుకింగ్స్‌గా కచ్చితంగా మారతాయని ఓటీఏ, హోటల్స్‌ నిర్వాహకులు ధీమావ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్‌ త్రైమాసికంతో పోలిస్తే జూన్‌ క్వార్టర్‌లో చాలా వరకు హోటల్స్‌ బుకింగ్స్, ఆక్యుపెన్సీ పెరుగుతుందని అంచనా వేశారు. 2019 ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్‌ కంటే మెరుగైన బుకింగ్స్‌ ఉంటాయని హోటల్స్‌ పరిశ్రమ చెబుతుంది.

డెహ్రాడూన్‌కు చెందిన లీజర్‌ హోటల్స్‌ గ్రూప్‌ వంటి లీజర్‌ లొకేషన్‌లో ఉన్న హోటల్స్, ట్రావెల్‌ కంపెనీలు ఎక్కువ ప్రయోజనాలు పొందుతాయని లీజర్‌ హోటల్స్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ విభాస్‌ ప్రసాద్‌ తెలిపారు. లీజర్‌ హోటల్స్‌కు చెందిన 90 శాతం ప్రాపర్టీలు పర్యాటక, విశ్రాంతి ప్రదేశాలలోనే ఉన్నాయని చెప్పారు. 2019 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది జూన్‌లో ఆయా ప్రాపర్టీల ఆక్యుపెన్సీ 85-95 శాతానికి చేరుకుంటుందని ధీమావ్యక్తం చేశారు. ఇప్పటికే కొండ ప్రాంతాల్లో ఉన్న లీజర్‌ గ్రూప్‌ పర్యాటక ప్రాపరీ్టలకు డిమాండ్‌ ఏర్పడిందని.. రానున్న రోజుల్లో మరింత పుంజుకుంటుందని ఆయన పేర్కొన్నారు. 

విదేశాల కంటే దేశీయ ప్రాంతాలకే.. 
పెద్ద హోటల్స్‌ చెయిన్స్‌లో కూడా బుకింగ్స్‌ డిమాండ్‌ ట్రెండ్‌ నమోదవుతుంది. శీతాకాలంతో పోలిస్తే సమ్మర్‌లో డిమాండ్‌ ఎక్కువగా ఉందని.. ఈ ఏడాది మొత్తం ఇదే ట్రెండ్‌ను కొనసాగుతుందని మారియట్‌ ఇంటర్నేషనల్‌ సౌత్‌ ఏషియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నీరజ్‌ గోవిల్‌ తెలిపారు. ఈ సమ్మర్‌లో లీజర్‌ ట్రావెలర్స్‌ విదేశాలకు బదులుగా దేశీయ ప్రయాణాలకే ఎక్కువ మక్కువ చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు. దీంతో దేశీయ ప్రయాణ, పర్యాటక రంగానికి పునరుత్తేజం సంతరించుకోనుందని తెలిపారు. 2019 వేసవితో పోలిస్తే ఈ సమ్మర్‌లో ప్రయాణ, పర్యాటక ఆక్యుపెన్సీ ధరలు తక్కువగా ఉంటాయని దీంతో ఆక్యుపెన్సీ 80-90 శాతం వృద్ధి చెందుతుందని సరోవర్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ ఎండీ అజయ్‌ భకయ తెలిపారు. 

గతేడాది చలికాలంతో పోలిస్తే ఈ ఏడాది వేసవిలో బుకింగ్స్‌ పెరుగుతాయని క్లియర్‌ట్రిప్‌.కామ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ సుబ్రమణియన్‌ తెలిపారు. ప్రయాణ ఆంక్షలు లేనంత వరకూ ఈ డిమాండ్‌ ఇలాగే కొన సాగుతుందని పేర్కొన్నారు. క్లియర్‌ట్రిప్‌లో హోళి, గుడ్‌ ఫ్రైడే నేపథ్యంలో లీజర్‌ ట్రావెల్స్‌కు అడ్వాన్స్‌ బుకింగ్స్‌ పెరిగాయని తెలిపారు. గోవా, శ్రీనగర్‌ వంటి దేశీయ పర్యాటక ప్రాంతాలు టాప్‌ డెస్టినేషన్స్‌ బుకింగ్స్‌లో నిలిచాయన్నారు. దేశంలోని ప్రధాన మెట్రో నగరాల నుంచి రెండు వైపుల బుకింగ్స్‌ 40 శాతం వరకు పెరిగాయి. ప్రస్తుతం దేశీయ లీజర్‌ ట్రావెల్‌ ప్రీ-కోవిడ్‌ స్థాయిలో 60-65 శాతానికి చేరిందని చెప్పారు.

చదవండి:

పులులు ఈదితే, మొసళ్లు ఒడ్డున సేద తీరుతాయి

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top