ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్ సంస్థ మెదడు సంకేతాలతో కంప్యూటర్లను నియంత్రించే సాంకేతికతను మరింత అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలో తమ తొలి ఉత్పత్తి పేరు ‘టెలిపతి’ (Telepathy) అని మస్క్ అధికారికంగా ప్రకటించారు. దీని ద్వారా మాట్లాడటం, కీబోర్డుపై టైప్ చేయడం వంటి అవసరం లేకుండానే కేవలం ఆలోచనలతో కంప్యూటర్లతో సంభాషించవచ్చని వెల్లడించారు.
రాబోయే కొన్నేళ్లలో ఈ సాంకేతికత ద్వారా సమాచారాన్ని పంపించే వేగం.. మనుషులు మాట్లాడటం లేదా వేగంగా టైప్ చేయడం కంటే ఎక్కువగా ఉంటుందని మస్క్ అంచనా వేశారు. కంప్యూటర్లతో పాటు ఇతర వ్యక్తులతోనూ ఆలోచనల ఆధారంగా వేగంగా కమ్యూనికేట్ చేయడం దీని లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ టెక్నాలజీ వెనుక న్యూరాలింక్ అభివృద్ధి చేసిన ఎన్1 (N1) బ్రెయిన్ ఇంప్లాంట్ కీలకంగా పనిచేస్తుంది. ఇందులో 64 సన్నని, సౌకర్యవంతమైన తీగలపై మొత్తం 1,024 ఎలక్ట్రోడ్లు అమర్చారు. ఇవి మెదడులోని కదలికలను నియంత్రించే మోటార్ కార్టెక్స్ నుంచి నాడీ సంకేతాలను సేకరిస్తాయి. ఆర్1 (R1) అనే ప్రత్యేక శస్త్రచికిత్స రోబోట్ ఈ తీగలను మెదడులో అమర్చుతుంది.
ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొంటున్న పక్షవాతం బాధితులు ఈ ఇంప్లాంట్ సాయంతో కంప్యూటర్ కర్సర్‌ను కదిలించడం, చదరంగం ఆడటం, డిజైన్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం వంటి పనులు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రధానంగా కర్సర్ నియంత్రణ అందుబాటులో ఉండగా, కీబోర్డు, ఇతర పరికరాల నియంత్రణ వంటి సదుపాయాలు ప్రయోగాత్మక దశలో ఉన్నాయి.
ఇదిలా ఉండగా, అక్టోబర్ 29న న్యూరాలింక్ ఇంజినీర్లు 72 గంటల పాటు ప్రత్యేక ఇన్నోవేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓ వాయిస్ (VOICE) క్లినికల్ ట్రయల్ భాగస్వామితో కలిసి కొత్త ఫీచర్లను అభివృద్ధి చేశారు. ఇందులో మాట్లాడాలనే ఉద్దేశాన్ని మెదడు సంకేతాల ద్వారా గుర్తించి ఆటోమేటిక్‌గా వాయిస్ కమ్యూనికేషన్ ప్రారంభించే సదుపాయం, మెదడు సంకేతాలను దృశ్యరూపంలో చూపించే సాధనాలు ఉన్నాయి. అంతేకాకుండా, 'హే న్యూరాలింక్' అని మనసులో అనుకుని ఆదేశాలు ఇవ్వడం ద్వారా గ్రోక్ ఏజెంట్‌తో కంప్యూటర్ పనులు చేయించే ప్రయోగాత్మక సదుపాయాన్ని కూడా రూపొందించారు.
మస్క్ ఇదే రోజు న్యూరాలింక్ రెండో ఉత్పత్తిగా ‘బ్లైండ్‌సైట్’ (Blindsight)ను కూడా ప్రకటించారు. పుట్టుకతోనే చూపులేని వారితో పాటు పూర్తిగా అంధులైన వారికి చూపును అందించడమే దీని లక్ష్యమని తెలిపారు. అయితే దీనికి ఇంకా నియంత్రణ సంస్థల అనుమతులు రావాల్సి ఉంది.
ఇదీ చదవండి: దేశంలోని బిజినెస్ స్కూళ్లన్నీ మూసేయడం మంచిది!


