వేలాదిగా ఏటీఎంలు, బ్రాంచ్‌లు మూసేస్తున్న ప్రముఖ బ్యాంక్‌.. ఏం జరుగుతోంది? | Sakshi
Sakshi News home page

వేలాదిగా ఏటీఎంలు, బ్రాంచ్‌లు మూసేస్తున్న ప్రముఖ బ్యాంక్‌.. ఏం జరుగుతోంది?

Published Mon, Feb 5 2024 1:08 PM

Commonwealth Bank close thousands of ATMs branches - Sakshi

ఆస్ట్రేలియాకు చెందిన అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన కామన్‌వెల్త్‌ బ్యాంక్‌ వేలాదిగా ఏటీఎంలు, బ్రాంచ్‌లు మూసేస్తోంది. రికార్డ్‌ స్థాయిలో లాభాలు ఉన్నప్పటికీ వేలాదిగా ఏటీఎంలు, బ్రాంచ్‌లను ఎందుకు మూసేస్తోందా అన్నది అంతుబట్టడం లేదు. కామన్వెల్త్ బ్యాంక్ గత ఐదేళ్లలో 354 శాఖలను మూసివేసింది. తాజాగా  మూడు ప్రధాన నగరాల్లోని అత్యంత జనాభా ఉన్న ప్రాంతాల్లో వచ్చే నెలలో మరో మూడు బ్రాంచ్‌లను మూసివేయాలని యోచిస్తోందని డైలీ మెయిల్‌ కథనం పేర్కొంది.

రికార్డ్ లాభాన్ని ఆర్జించినప్పటికీ ఆస్ట్రేలియా అతిపెద్ద హౌసింగ్‌ బ్యాక్‌ అయిన కామన్‌వెల్త్‌ బ్యాంక్‌కి 2018 జూన్ నాటికి 1,082 బ్రాంచ్‌లు ఉండగా అప్పటి నుంచి ఇప్పటి వరకూ వాటిలో మూడవ వంతు బ్రాంచ్‌లను మూసివేసింది. నగదు వినియోగంలో బాగా క్షీణించిన సమయంలో అయితే ఈ బ్యాంక్‌ ఏకంగా 2,297 ఏటీఎంలను తొలగించింది. దీంతో ఆ బ్యాంక్‌ ఏటీఎంల సంఖ్య 54 శాతం పడిపోయింది.

కామన్వెల్త్ బ్యాంక్ ఇప్పుడు సెంట్రల్ అడిలైడ్‌లోని తన రండిల్ మాల్ శాఖను , గోల్డ్ కోస్ట్‌లోని కూలన్‌గట్ట, సిడ్నీలోని కూగీలో అవుట్‌లెట్‌లను మార్చి 1న మూసివేయాలని యోచిస్తోంది. ఇటీవలి సమీక్ష తర్వాత, మా రండిల్ మాల్ అడిలైడ్, కూలంగాట్ట, కూగీ బ్రాంచ్‌లను శాశ్వతంగా మూసివేయాలని నిర్ణయించినట్లు బ్యాంక్‌ ప్రతినిధి ఒకరు చెప్పినట్లు డైలీ మెయిల్‌ పేర్కొంది. కామన్‌వెల్త్ బ్యాంక్ అనుబంధ సంస్థ బ్యాంక్‌వెస్ట్ కూడా రాబోయే వారాల్లో పెర్త్, పశ్చిమ ఆస్ట్రేలియాలోని ప్రాంతీయ శాఖలను మూసివేస్తోంది.

ఆస్ట్రేలియన్ మల్టీ నేషనల్‌ బ్యాంక్‌ అయిన కామన్‌వెల్త్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా ( CBA) ఆస్ట్రేలియాతోపాటు న్యూజిలాండ్ , ఆసియా , యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్ అంతటా వ్యాపారాలను నిర్వహిస్తోంది. రిటైల్, బిజినెస్, ఇన్‌స్టిట్యూషనల్ బ్యాంకింగ్, ఫండ్ మేనేజ్‌మెంట్ , సూపర్‌యాన్యుయేషన్ , ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్‌మెంట్ అండ్‌ బ్రోకింగ్ సేవలతోపాటు వివిధ రకాల ఆర్థిక సేవలను అందిస్తోంది. 1911లో ఆస్ట్రేలియా ప్రభుత్వం దీన్ని స్థాపించగా 1996లో పూర్తిగా ప్రైవేటీకరించారు. ఇది ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్‌ మహిళల జట్టుకు జర్సీ స్పాన్సర్‌గా కొనసాగుతోంది.

 
Advertisement
 
Advertisement