
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాజ్యమేలుతోంది. దాదాపు అన్ని రంగాల్లో కృత్రిమ మేధ హవా కొనసాగుతోంది. ఇప్పటికే చాలా రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఏఐ.. వైద్య రంగంలో కూడా అద్భుతాలు సృష్టిస్తోంది. ఆధునిక వైద్య శాస్త్రాన్ని పునర్నిర్వచించగల చర్యలో భాగంగా.. చైనా ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి AI ఆధారిత ఆసుపత్రి (ఏజెంట్ హాస్పిటల్)ని ప్రారంభించింది.
సింఘువా యూనివర్సిటీ పరిశోధకులు ఏఐ బేస్డ్ "ఏజెంట్ హాస్పిటల్"ను సృష్టించారు. ఇక్కడ ఉన్న డాక్టర్లు, నర్సులు అన్నీ కూడా రోబోలే. ఇక్కడ ఏఐ డాక్టర్లు.. ఉబ్బసం, గొంతునొప్పి వంటి సుమారు 30 రకాల జబ్బులకు చికిత్స అందిస్తాయి. ఈ వినూత్న ప్రయత్నం వైద్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.
ఏజెంట్ హాస్పిటల్ రీసర్చ్ టీమ్ లీడర్ 'లియు యాంగ్' మాట్లాడుతూ.. ఏఐ డాక్టర్లు రోగులకు చికిత్స చేయడానికి మాత్రమే కాకుండా.. వైద్య విద్యార్థులకు మెరుగైన శిక్షణను అందించడానికి కూడా ఉపయోగపడతాయని అన్నారు. ఎందుకంటే.. ఈ ఏఐ ఏజెంట్లు యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ (USMLE)లో 93.06 శాతం స్కోర్ సాధించాయని పేర్కొన్నారు.
కొన్ని వారాలలోనే.. సంవత్సరాల క్లినిక్ అనుభవాన్ని పొందగల ఏఐ డాక్టర్లు రోగ నిర్దారణలో కూడా ప్రావీణ్యం పొంది ఉన్నాయని అన్నారు. ఏఐ వైద్య సిబ్బంది.. లైసెన్సింగ్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించగలిగితే.. శస్త్రచికిత్సలు సైతం చేయగలవు. ఏజెంట్ హాస్పిటల్‌లో 14 మంది ఏఐ డాక్టర్లు, నలుగురు ఏఐ నర్సులతో కూడిన సిబ్బంది ఉన్నారు. వీరందరూ.. రోజుకు 3000 మంది రోగులతో.. పరస్పర చర్య చేయగలరని లియు యాంగ్ అన్నారు.
ఇదీ చదవండి: 'అమెరికాలో ఉంటున్న భారతీయులకు హెచ్చరిక'
టెక్నాలజీ అభివృద్ధి చెందటం.. వైద్య రంగంలో ఏఐ డాక్టర్లు పుట్టుకురావడం బాగానే ఉంది. ఇవన్నీ యంత్రాలు కాబట్టి.. ఇవి భావోద్వేగాలకు అతీతం. కాబట్టి ఏదైనా చిన్న పొరపాటు జరిగినా.. రోగుల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి వైద్య రంగంలో సహాయకులుగా, వైద్య విద్యార్థులు బోధించడానికి ఏఐ సిబ్బంది ఉపయోగపడినప్పటికీ, ఆపరేషన్స్ చేయడం వంటివి ఏ మాత్రం సమంజసం?.. అనేది ఆలోచించాలి.